నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-06-10T08:11:07+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోని ముఖ్యమంత్రి

నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో సమావేశం

కేంద్ర మంత్రులు ప్రధాన్‌, షెకావత్‌, పియూష్‌, జావడేకర్‌లతోనూ భేటీలు

రేపు మధ్యాహ్నం తిరిగి రాక

బెయిలు రద్దు పిటిషన్‌, రఘురామ వివాదంతో కీలకంగా మారిన ఢిల్లీ యాత్ర


అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసం 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. నిజానికి... ఆయన సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సమయం కుదరకపోవడంతో వాయిదా పడింది. గురువారం అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్‌ కలిసే అవకాశముంది. తన బెయిలు రద్దు పిటిషన్‌పై ఈనెల 14న తదుపరి విచారణ జరగనుండటం... ఎంపీ రఘురామరాజు అరెస్టు - సీఐడీ కస్టడీలో గాయాలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సీఎం ఢిల్లీ పర్యటనకు, అక్కడ అమిత్‌షాతో జరగనున్న సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తోనూ సమావేశం కావాలని జగన్‌ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి... రాజ్‌నాథ్‌ అపాయింట్‌మెంట్‌ కోరలేదని తెలిసింది.


కేంద్ర మంత్రులతో వరుస భేటీలు...

తన ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌, అటవీ పర్యావరణ, సమాచార ప్రసార శాఖమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌లతో ముఖ్యమంత్రి  సమావేశమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై వారికి వినతిపత్రాలు సమర్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను ఖరారు చేయడంతోపాటు నిధులు విడుదల చేయాలని మరోసారి జలశక్తి మంత్రి షెకావత్‌ను కోరనున్నారు. ఇతర మంత్రులతో భేటీలు ముగిసిన తర్వాత... రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో సమావేశమవుతారు. గురువారం రాత్రి జగన్‌ ఢిల్లీలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారని అధికారిక సమాచారం అందింది. 


ఈసారీ రహస్యమేనా?   

జగన్‌ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానితో భేటీ కాకపోయినా.. హోం మంత్రి అమిత్‌షాను తప్పకుండా కలుస్తున్నారు. ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకకపోతే.. ఇతర మంత్రులను కలవకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కడప స్టీల్‌ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ తదితర అంశాలపై మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారంటూ సీఎం కార్యాలయం వాట్సప్‌ సందేశాలను పంపిస్తోంది. అంతేతప్ప,  కేంద్రానికి సమర్పించిన వినతిపత్రం ప్రతులను బయటపెట్టడంలేదు. ముఖ్యమంత్రి మీడియాతోనూ మాట్లాడటంలేదు. దీంతో... జగన్‌ ఢిల్లీకి చేస్తున్న అధికారిక పర్యటనలన్నీ... ‘రహస్య భేటీ’లుగా మారిపోతున్నాయి.

Updated Date - 2021-06-10T08:11:07+05:30 IST