గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పనితీరుపై.. సీఎం కేసీఆర్‌ నిరంతర పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-11-22T09:04:39+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పనితీరును ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పనితీరుపై.. సీఎం కేసీఆర్‌  నిరంతర పర్యవేక్షణ

రోజూ ప్రెస్‌మీట్లు పెట్టాలని నేతలకు నిర్దేశం

ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, బుజ్జగింపుల ప్రక్రియ చేపట్టిన కేటీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పనితీరును ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దుబ్బాకలో పార్టీ అనూహ్య ఓటమి నేపథ్యంలో కీలకమైన గ్రేటర్‌ ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. పార్టీ తరఫున ఈ ఎన్నికల సారథిగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగు సూచనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై వివిధ మార్గాల ద్వారా తనకు అందుతున్న నివేదికల ఆధారంగా తక్షణం అమల్లో పెట్టాల్సిన వ్యూహాలపై సలహాలు ఇస్తున్నారు. గ్రేటర్‌లోని డివిజన్ల వారీగా పార్టీ ఇన్‌చార్జిలుగా ప్రచారంలో పాల్గొంటున్న పలువురు మంత్రులు, ముఖ్య నేతలతోనూ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. అదే సమయంలో తనవద్ద ఆయా డివిజన్లకు సంబంధించి ఉన్న సమాచారాన్ని వారితో పంచుకుంటున్నారు.


అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను తిప్పికొట్టటానికి ప్రతిరోజూ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశాలు పెట్టాలని పార్టీ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దాంతో, గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు నాలుగైదు ప్రెస్‌మీట్లకు తెలంగాణ భవన్‌ వేదికవుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఆ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్న వారిపై టీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకుపడే విషయంలో పోటీ పడటానికి సీఎం కేసీఆర్‌ నుంచి వచ్చిన ఆదేశాలే కా రణమని సమాచారం.


కేటీఆర్‌ బుజ్జగింపులు

గ్రేటర్‌ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు, అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పలు డివిజన్ల నుంచి టీఆర్‌ఎస్‌ అధికారిక అభ్యర్థులపై రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారిని, టికెట్‌ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలను నందినగర్‌లోని తన నివాసానికి పిలిపించి ఆయన మాట్లాడారు. రెబల్స్‌ అంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని నిర్దేశించారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-22T09:04:39+05:30 IST