Abn logo
Sep 27 2021 @ 02:29AM

తెలంగాణలో తుడిచిపెట్టాం

  • బహుముఖ వ్యూహంతో కట్టడి చేస్తున్నాం..
  • అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు 
  • కేంద్ర హోంశాఖ సమావేశంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు
  • సాంకేతికత వినియోగంతో కదలికలు తెలుసుకుంటున్నాం
  • సరిహద్దుల్లో పటిష్ఠ చర్యలు చేపట్టాం
  • నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలకు కేంద్రం వంద శాతం నిధులివ్వాలి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నక్సలైట్లను దాదాపుగా తుడిచిపెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మావోయిస్టుల కట్టడికి బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో నక్సలైట్ల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, శాంతిభద్రతల పరిస్థితులు, తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ప్రగతిశీల చర్యలు, విధానాలతో రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గిందని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని, సామాజికంగా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు జిల్లాల్లోకి మావోయిస్టులు ప్రవేశించి పలు ఘటనలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయని కేసీఆర్‌ వెల్లడించారు. వాటిని అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు మావోయిస్టుల కదలికలను తెలుసుకోవడానికి సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. మావోయిస్టుల కట్టడికి ఓవైపు సరెండర్‌ పాలసీని అమలు చేస్తూనే కొత్తగా మావోయిస్టు పార్టీలో చేరకుండా చూడగలుగుతున్నామని అన్నారు. అవసరమైనప్పుడు పోలీసులు పలు ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో నక్సలైట్ల కట్టడికి కేసీఆర్‌ పలు సలహాలు, సూచనలు చేసినట్లు తెలిసింది.


వంద శాతం నిధులివ్వాలి..

వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు భరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరినట్లు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోడ్లను మంజూరు చేసి నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రోడ్లతోపాటు పాఠశాలలు, వైద్య కేంద్రాలను కూడా ఆయా పథకాల కింద మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పోలీసు ఆధునికీకరణకు మరిన్ని నిధులు, అదనపు బలగాల గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు.


అమిత్‌షాతో కేసీఆర్‌ ఏకాంత భేటీ

గంటకుపైగా సమావేశం.. మూడు వారాల్లో రెండోసారి

సీఎం కేసీఆర్‌.. అమిత్‌షాతో మరోసారి ఏకాంతంగా భేటీ అయ్యారు. గంటకు పైగా కీలక సమాలోచనలు జరిపారు. తొలుత నక్సలిజంపై జరిగిన సమావేశ స్థలంలోనే కొద్దిసేపు మంతనాలు జరిపారు. మధ్యాహ్న భోజన సమయంలో అమిత్‌ షా తోపాటు కూర్చొని మరో ముగ్గురు సీఎంలతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత కూడా ఆయనతో ఆంతరంగికంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సాయంత్రం 6గంటలకు కలుస్తానని అమిత్‌షాను కేసీఆర్‌ కోరారని, అయితే తానే కబురు పంపిస్తానని ఆయన చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పియూష్‌ గోయెల్‌ను కలిసిన తర్వాత అమిత్‌షాను కలుసుకోవాలని, ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోవాలని కేసీఆర్‌ భావించారని, కబురు రాకపోతే తుగ్లక్‌ రోడ్‌లోని ఇంటికి వెళ్లిపోయారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రాత్రి 8.30గంటల ప్రాంతంలో అమిత్‌షా నివాసం నుంచి ఫోన్‌ రావడంతో కేసీఆర్‌ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. రాత్రి 9 గంటలకు లోపలికి వెళ్లిన కేసీఆర్‌ 10.10 గంటలకు బయటకు వచ్చారు. కాగా, ఇద్దరి మధ్యే ముఖాముఖి ఆంతరంగిక చర్చలు జరిగాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. కానీ, గత మూడువారాల్లో అమిత్‌షాతో కేసీఆర్‌ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ నెల 4న వీరు 45 నిమిషాలపాటు సమావేశం కావడం తెలిసిందే. దీంతో తాజా భేటీ వెనుక మతలబేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.