Abn logo
Jul 8 2020 @ 00:38AM

వైద్య ఆరోగ్య వనరులన్నీ సమాయత్తం కావాలి!

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైద్యుల సేవలను వారి మొత్తం సామర్థ్యంతో ఉపయోగించుకోవాలి. మొత్తం పడకల సామర్థ్యాన్ని వాడుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాలను రాష్ట్రమంతటా వినియోగించుకోవాలి. మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి జిల్లాలో హౌస్ సర్జన్లు, పిజి విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. ప్రాథమిక సంరక్షణ, ద్వితీయ, తృతీయ సంరక్షణలో సిహెచ్‌సి, పిహెచ్‌సి, ఏరియా, జిల్లా, బోధనా ఆసుపత్రులు ఎక్కడ ఉన్నా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.


హైదరాబాద్‌గా పిలబడే ఒకనాటి భాగ్యనగరం, గచ్చుబావి (గచ్చీబౌలి) పరిసరాలలోని 1500 పడకల ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్’ (టిమ్స్) ఆసుపత్రి లాంఛనంగా ప్రారంభమై కొద్ది రోజులైంది. అక్కడ ప్రస్తుతానికి మాత్రం, కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య పరికరాలను, వెసులుబాటులను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఒక మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టిమ్స్ ఆసుపత్రికి అవసరమైన క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బందిని వివిధ విభాగాలలో నియామకం చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీరిలో ప్రొఫెసర్లు, జనరల్ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియో డయాగ్నో స్టిక్, అనస్థీషియా, టీబీ, న్యూరాలజీ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లూ ఉంటారు. అధికారులు, స్టాఫ్ నర్సులు, హాస్పిటల్ నిర్వహణ సిబ్బంది, ఇతర వైద్య, పారామెడికల్ అనుబంధ సిబ్బందిని కూడా నియమిస్తారు.


దీనికి అదనంగా, కరోనా వైరస్ ఆరంభం అయినప్పటి నుంచీ గాంధీ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ ఛాతీ-జనరల్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటళ్ళను కూడా కోవిడ్ -19చికిత్స ప్రత్యేక ఆసుపత్రులుగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి తోడు, ఇటీవల కాలం నుండి, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి హైదరాబాద్‌లో ఐసిఎంఆర్ ఆమోదం పొందిన 17 ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నాయి. వీటితోపాటు, లక్షణాలు ఉన్న ఎవరైనా బస్తీ దవాఖానా లేదా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను సంప్రదించినట్లయితే, వారిని సరోజినీ దేవి నేత్ర హాస్పిటల్ లేదా కింగ్ కోటీ హాస్పిటల్ లేదా కరోనా పరీక్షల తదుపరి నిర్ధారణ సౌకర్యం ఉన్న మరే ఇతర ఉన్నత కేంద్రానికైనా రిఫర్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7 ఆసుపత్రులను గుర్తించి, 21 జిల్లాలకు అక్కడ కరోనా పరీక్షలను చేయడానికి అనువైన స్థలాలుగా వెసులుబాటు కల్పించింది. పలు ప్రయివేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా వున్న ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయడానికి ఏర్పాట్లు జరిగాయని అధికారులు చెప్తున్నారు.


కరోనా వైరస్ సోకిన రోగులకు వారి సంఖ్య ఏమైనప్పటికీ చికిత్స చేయగల సామర్థ్యం, సౌకర్యాలు, సామగ్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో 2150 మంది రోగులకు చికిత్స చేయడానికి సౌకర్యాలు ఉన్నాయని, అలాగే ఆక్సిజన్ సహాయక సదుపాయంతో 1000 పడకలు ఉన్నాయని వారు తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించేందుకు మరిన్ని పడకలను సిద్ధం చేస్తున్నది. గచ్చిబౌలిలో ఏర్పాట్లు పూర్తయిన టిమ్స్‌ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రులలోనూ ప్రత్యేక బెడ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. 


ఇవన్నీ విశ్లేషించి చూస్తుంటే, నిస్సంకోచంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విభాగం పీపీఈ, ఎన్-95 మాస్క్‌ సమకూర్చడంతోపాటు, కరోనా రోగికి చికిత్స చేయడానికి అవసరమైన ఇతర అవసరాలు వేటినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నదనేది అవగతమౌతున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 3600 పడకలు ఉన్నాయని, ఆక్సిజన్ సౌలభ్యం ఉందని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. 


సీఎం కేసీఆర్ ఒకటికి పదిసార్లు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా భరోసా ఇస్తూ, కరోనా రోగులకు వారి సంఖ్య ఏమైనప్పటికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్తున్నారు. టెస్ట్ కిట్లు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు, ఐసియు బెడ్స్, సాధారణ పడకలు, మాస్కులు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. భావి అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వేతర వైద్య ఆరోగ్య సదుపాయాలను సమీకృతం చేయడం ద్వారా తగిన వైద్య ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వ వ్యవస్థను రూపుదిద్దుతున్నామని కూడా కేసీఆర్ చెప్పారు. 


ఏది ఏమైనా, కోవిడ్-19 పరీక్షా కేంద్రాలతోపాటు ఆసుపత్రుల పెరుగుదల ఇంకా అవసరం ఉన్నట్లు కొందరి సూచనల ద్వారా తెలుస్తోంది. మురికివాడలలోను, వెలుపలా నివసించే జనాభాకు, హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు లేదా కనీస సౌకర్యాలతో ఉన్న గత ఎన్నికల పోలింగు బూత్‌ కేంద్రాలను కరోనా పరీక్షా కేంద్రాలుగా నియమించవచ్చు. తగిన శిక్షణ ఇచ్చిన తరువాత పూర్తి రక్షణతో షిఫ్టులలో అక్కడ పరీక్షా పనికి హాజరుకావడానికి అంగన్ వాడీ, ఆశా కార్మికుడిని డాక్టర్ నేతృత్వంలోని బృందంగా తయారు చేయవచ్చు.


హైదరాబాద్ నగరంలో జనాభా లెక్కలకు అనుగుణంగా, ప్రతి 2500మందికీ (అందరినీ పరీక్షించాల్సిన అవసరం లేదు) ఒక కేంద్రం చొప్పున 4000 కేంద్రాల అవసరం ఉంటుంది. ఒక్కో వైద్యుడు సగటున 8-10 గంటలు పని చేస్తూ రెండు సెంటర్లకు పర్యవేక్షకుడిగా, వైద్యుడిగా పని చేయవచ్చు. అన్ని కేంద్రాలను కవర్ చేయడానికి గరిష్ఠంగా 2000 మంది వైద్యులు అవసరం ఉంటుంది. ఈ వైద్యులను తాత్కాలికంగా, ప్రత్యేకించి ఈ ప్రయోజనం కోసం నియమించడం కానీ, లేదా ఇన్-సర్వీస్ హౌస్ సర్జన్లకు అప్పచెప్పడం కానీ చేయవచ్చు. 


ప్రతి సంవత్సరం సగటున 3000 పైగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలలో విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి చేరుతున్నారు. ప్రతి సంవత్సరం మూడింట కనీసం రెండు వంతుల మంది ఉత్తీర్ణత సాధించినప్పటికీ, కరోనా పరీక్షా కేంద్రాలకు అందుబాటులో ఉన్న హౌస్ సర్జన్ల సంఖ్య 2000కి సమీపంలో ఉంటుంది. క్లినికల్ జనరల్ చెకప్ చేయడమే వారి పని. తనిఖీ చేయడం, పరీక్షను నిర్వహించడం వారి డ్యూటీ. ఇది ఒక విధంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ రిఫెరల్ కేంద్రం. ఈ కేంద్రాలు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న మురికివాడలలో మొదట్లో ఆరంభించి, తరువాత విస్తరించుకోవచ్చు.


హైదరాబాద్‌లో వున్న ప్రస్తుత పట్టణ ఆరోగ్య కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచవచ్చు. ఇక్కడ మొదటి రిఫెరల్ కేంద్రంగా పనిచేయడానికి అర్హత కలిగిన వైద్యుడు ఉండాలి. సమగ్ర విధానం కోసం ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రానికి నిర్దిష్ట సంఖ్యలో కరోనా పరీక్షా కేంద్రాలను జతచేయవచ్చు. రొటేషన్ పద్ధతిపై వివిధ ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల పీజీ వైద్య విద్యార్థులు ద్వితీయ ఆరోగ్య సంరక్షణ కోసం ఉండాల్సిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వైరస్ ప్రభావిత వ్యక్తికి ఆసుపత్రిలో చేరటాన్ని గురించి, లేదా, గృహ క్వారంటైన్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం వీరి పని. ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు కలిపి సగటున తెలంగాణలో 1000 మంది పీజీ విద్యార్థులు ఉంటారు. కరోనా వైరస్ నుండి రాష్ట్రం విముక్తి పొందిన తరువాత, వీటినే మొదటి రిఫెరల్ హెల్త్ కేర్‌సెంటర్లుగా మార్చవచ్చు.


ప్రాథమిక, ద్వితీయ దశలలో కరోనా పరీక్షా కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో, అవసరమైన నమూనా సేకరణలు తీసుకోవచ్చు. తృతీయ దశ సంరక్షణలో రోగి ఇతర వైద్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా అనే దానిపై మరింత రోగనిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చక్కెర వ్యాధి లాంటి అవసరమైన పరీక్షలు చేయవచ్చు. ప్రాథమిక, ద్వితీయ దశ తరువాత, మూడవ దశ తృతీయ సంరక్షణ ఆసుపత్రి. ఇది ప్రభుత్వం నియమించిన టిమ్స్, గాంధీ, ఛాతీ వంటి ఆసుపత్రులలో లేదా 17 ఐసిఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ఆసుపత్రులలో చేయవచ్చు. 


ఆంధ్ర మహిళా సభ, మహావీర్, సెయింట్ థెరిసా వంటి ఎన్జీఓలు నడుపుతున్న ఆస్పత్రులను, వీటితో పాటు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, ఆర్టీసీ, రైల్వే, మిలిటరీ ఆసుపత్రులను కూడా సమీకృతంగా చేర్చుకోవడానికి ఒక సమగ్ర విధానం ఉండాలి.


గ్రామీణ ప్రాంతాల్లో ఉప కేంద్రాలతో ప్రారంభమై, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సి), ఏరియా హాస్పిటల్స్ తర్వాత జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. బోధనా ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అదనంగా, ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురోపతి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ప్రస్తుతానికి వీటిని ఏకీకృతం చేయడానికి ఆలోచన చేయవచ్చు. హోమియో, ఆయుర్వేద వాడకాన్ని అందుబాటులోకి తేవడం కూడా మంచి ఆలోచన అవుతుంది.


కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైద్యుల సేవలను వారి మొత్తం సామర్థ్యంతో ఉపయోగించుకోవాలి. మొత్తం పడకల సామర్థ్యాన్ని వాడుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాలను రాష్ట్రమంతటా వినియోగించుకోవాలి. మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి జిల్లాలో సంవత్సరానికి హౌస్ సర్జన్లు, పిజి విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. ప్రాథమిక సంరక్షణ, ద్వితీయ, తృతీయ సంరక్షణలో సిహెచ్‌సి, పిహెచ్‌సి, ఏరియా, జిల్లా, బోధనా ఆసుపత్రులు ఎక్కడ ఉన్నా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.


గ్రామాల్లో నివసించే జనాభాకు అర్హత కలిగిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను టెలి-మెడిసిన్ ద్వారా లేదా ఎఫ్‌డిహెచ్‌ఎస్ (నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలు) పథకం ద్వారా పొందవచ్చు. ఎఫ్‌డిహెచ్‌ఎస్, మొబైల్ హెల్త్ యూనిట్లను బలోపేతం చేయాలి. బహుశా, ఈ ఆలోచనలపై ఒకింత దృష్టి సారిస్తే కరోనా కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యం మెరుగు కావచ్చు. 


వనం జ్వాలా నరసింహారావు

      

Advertisement
Advertisement
Advertisement