కౌశిక్ రెడ్డికి CM KCR షాక్.. అయినా కీలక పదవి!

ABN , First Publish Date - 2021-08-02T03:51:03+05:30 IST

కాంగ్రెస్‌కు గుడ్ బాయ్ చెప్పిన హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి..

కౌశిక్ రెడ్డికి CM KCR షాక్.. అయినా కీలక పదవి!

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్ బాయ్ చెప్పిన హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి.. సీఎం కేసీఆర్ సమక్షంలోటీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌ను వీడటానికి ఆడియో క్లిప్ కారణమన్న విషయం విదితమే. ఉపఎన్నికలో తనకు టీఆర్ఎస్ టికెట్ దక్కుతోందని అందరూ సపోర్ట్ చేయాలన్నదే ఆ ఆడియో సారాంశం. కౌశిక్ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు అందరూ ఆయన టీఆర్ఎస్‌లో చేరగానే టికెట్ ఇస్తారని భావించారు. కౌశిక్ కూడా టికెట్ ఆశించే కారెక్కేశారు.!. అయితే సీఎం కేసీఆర్.. కౌశిక్‌కు ఊహించని రీతిలో షాకిచ్చారు. ఇది కౌశిక్‌కు కాసింత చేదువార్తే అయినా.. ఎమ్మెల్సీ అనే కీలక పదవిని గులాబీ బాస్ ఇవ్వబోతున్నారు.


ఇవాళే నిర్ణయం.. సిఫారసు కూడా..!

ఆదివారం నాడు తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఆయనకు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదని.. ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించేశారు.! నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ నిర్ణయించడం.. రాత్రికి రాత్రే రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫారసు చేసింది. అయితే.. ఈ ప్రకటన తర్వాత కౌశిక్ అభిమానులు, అనుచరులు అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.


కాస్త అసంతృప్తి.. అయినా సంతోషమే..!

అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచుండేవారని కొందరు కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారట. అయితే.. ఎమ్మెల్సీ పదవి హామీతోనే కౌశిక్ కారెక్కారా లేకుంటే.. సడన్‌గా ఇలా ఇవాళ కేబినెట్‌లో షాకిచ్చారా..? అనేది తెలియరాలేదు. ఏదైతేనేం.. కౌశిక్ అనుచరులు తన అభిమాన నేతకు టికెట్ దక్కలేదనే బాధ కాస్త ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీ దక్కిందనే సంతోషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. పార్టీలో చేరగానే కౌశిక్‌ను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారంటే సంతోషమే అని అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరతారన్నప్పట్నుంచే ఆయన చేరినా టికెట్ ఇవ్వరని కొందరు కీలక నేతలు లీకులు చేస్తూ వచ్చారు. ఇవాళ్టితో ఇది అక్షరాలా నిజమైంది. అయితే.. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేదెవరు..? ఒక వేళ కేసీఆర్ మనసు మార్చుకుని మళ్లీ కౌశిక్‌నే బరిలోకి దింపుతారా..? లేకుంటే వేరే అభ్యర్థిని పోటీలో నిలబెడతారా..? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - 2021-08-02T03:51:03+05:30 IST