సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకే..!

ABN , First Publish Date - 2021-11-26T09:27:34+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌, రైతు వ్యతిరేకి అంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ అన్నారు రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారని.

సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకే..!

  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు ఆమోదయోగ్యంగా లేదు
  • రైతు పోరాటంపై టీఆర్‌ఎస్‌ తీరు అనుమానాస్పదం 
  • ఉద్యమం ఉన్న చోట బీజేపీకి ఓట్లు రావు
  • ‘ఆంధ్రజ్యోతి’తో బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌


హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్‌, రైతు వ్యతిరేకి అంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ అన్నారు  రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు ఆమోదయోగ్యంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  రైతు ఉద్యమం ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు ఉద్యమంపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు చట్టాల పోరాటంలో అమరులైన రైతుల కుటుంబాలకి కేసీఆర్‌ సర్కారు పరిహారం ఇస్తామన్న హామీని స్వాగతించారు. గురువారం ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్‌ వచ్చిన టికాయత్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. 


సాగు చట్టాల రద్దును కేబినెట్‌ ఆమోదించింది కదా. ఇంకా ఈ ఉద్యమాలు ఎందుకు? 

మేము ఆ మూడు చట్టాల రద్దు కోసమే ఉద్యమించలేదన్న విషయం మీకు తెలియాలి. అసలు చట్టాలు రూపకల్పన విధానం, రద్దు చేసిన తీరులో ఏమైనా ప్రజాస్వామిక ధృక్పథం కనిపించిందా? ఒక చట్టం చేసే ముందు  రైతు సంఘాలతో సంప్రదించాలి. మోదీ సర్కారు ఆ పని చేయలేదు. పైగా రైతుల విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సంవత్సరం పాటు రైతులు ఉధృతమైన పోరాటం చేస్తే.. చట్టాలను రద్దు చేసే ముందైనా రైతు సంఘాలు, పార్టీలతో చర్చించలేదు. ఇది దారుణం. దేశంలో మేము ప్రజాస్వామిక వాతావరణం కోరుకుంటున్నాం. ఆ విధంగానే మద్దతు ధరకు చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాం. పంటలకు మద్దతు ధరను స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఇస్తే రైతులకు  లాభం జరుగుతుంది. ఇదే మా ప్రస్తుత ప్రధాన డిమాండ్‌. 


తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలున్నాయి కదా? 

ఇవన్నీ మంచి పథకాలే. వాటిని దేశంలోని అన్ని రాష్ర్టాలు అమలు చేయాలని అభిలషిస్తున్నాం. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఆ పథకాలు అమలు చేసే విధంగా ఉద్యమాలు చేస్తాం. ఇక రైతు ఉద్యమం విషయంలో టీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరి చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి పోరాటం... మరొకసారి గమ్మున ఉండటం మా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే, టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి కొమ్ముకాసేదే.


ఎంఎస్పీ ఇవ్వలేమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది కదా? 

ప్రస్తుతం పీఎం నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేసింది నిజం కాదా? తాము ప్రస్తుతం డిమాండ్‌ చేస్తున్న అంశాలన్నీ గతంలో మోదీ లేవనెత్తిన విషయాలే.  దేశవ్యాప్తంగా రైతాంగం పండిస్తున్న 23 పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి. లేదంటే  ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాలు ప్రచారం చేస్తాయి. ఇదే మా భవిష్యత్తు వ్యూహం... కార్యాచరణ.


రానున్న రోజుల్లో మీ పోరాట రూపమేంటి?  

ఎంఎస్పీ గ్యాంరెటీ చట్టం కావాలి. విద్యుత్తు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలోని 18 శాఖల సమన్వయంతో ప్రత్యేకంగా ఒక వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ రంగ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలతో కమిటీ వేసి రైతుల డిమాండ్లపై సుదీర్ఘ సమాలోచనలు జరపాలి. ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం రూపకల్పన చేసి... అన్నదాతల పంటకు భరోసా తీసుకురావాలి. ఈ నెల 29 నుంచి ప్రతి రోజూ 500 ట్రాక్టర్లతో రైతులు పార్లమెంట్‌కు తీసుకొచ్చి నిరసన తెలుపుతాం. దేశంలో ఎక్కడైతే రైతు ఉద్యమం బలంగా ఉంటుందో అక్కడ బీజేపీకి ఓటు బ్యాంకు ఉండదు. జనం సైతం బీజేపీపై ద్వేషం పెంచుకునే పరిస్థితి నేడు ఏర్పడింది.


తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మీ కామెంట్‌?

 తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు బాధపడుతున్నారు. అయితే, ఈ సమస్య అంతా రాష్ట్ర ప్రభుత్వ అనుమానాస్పద వైఖరి కారణంగానే ఏర్పడింది. సరైన కాలంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఉండాల్సింది.  వాస్తవానికి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలోనూ కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలి. దేశంలో పండే పంటలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే విధిగా కొనుగోలు చేయాలి. ఎంఎస్పీ చట్టం చేసి... దానికి అనుగుణం తీసుకోవాలి. వ్యాపారి ఇష్టారీతిన ధరల నిర్ణయించకుండా చూసే చట్టాన్ని కూడా కేంద్రం తీసుకురావాలి. వీటిపై కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేయడం లేదు. అందుకే రైతుల్లో ఒక రకమైన అనుమానం నెలకొంటుంది. దాన్ని తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుదే.


రైతు ఉద్యమంలో బలైన వారికి తెలంగాణ సర్కారు పరిహారం ప్రకటించింది. మీ వైఖరేంటి?

ఇది గొప్ప విషయం. మేము కూడా స్వాగతిస్తున్నాం. పీఎం మోదీ కేవలం క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఏం చేస్తారో ఆయన చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వమూ ఎక్కడా ప్రకటించలేదు. ఏ విధమైన చర్చలు జరగలేదు. ఈ విషయంపై రానున్న రోజుల్లో కేంద్రం ముందుకు వస్తే మా డిమాండ్లను ప్రభుత్వానికి తెలుపుతాం. అప్పుడు మా స్పష్టమైన ఎజెండాను  చెబుతాం. అంతవరకు ఉద్యమం కొనసాగిస్తాం.

Updated Date - 2021-11-26T09:27:34+05:30 IST