సీఎం.. ‘ఐ లవ్‌ ఆర్టీసీ’ అంటారు..

ABN , First Publish Date - 2020-02-02T05:46:43+05:30 IST

సీఎం కేసీఆర్‌ ‘ఐ లవ్‌ ఆర్టీసీ’ అంటారని, ఆయన గతంలో రవాణామంత్రిగా సంస్థను లాభాల బాటలో తెచ్చిన ఘనత దక్కించుకున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గుర్తు చేశారు.

సీఎం.. ‘ఐ లవ్‌ ఆర్టీసీ’ అంటారు..

రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సీఎం కేసీఆర్‌ ‘ఐ లవ్‌ ఆర్టీసీ’ అంటారని, ఆయన గతంలో రవాణామంత్రిగా సంస్థను లాభాల బాటలో తెచ్చిన ఘనత దక్కించుకున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గుర్తు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం లో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు-2020, రోడ్డు భద్రతా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రమాద రహిత సర్వీసు ఉన్న డ్రైవర్లు, అతి తక్కువ ప్రమాదాల రేటు నమోదు చేసిన డిపోలకు అవార్డులు ప్రదానం చేశారు. 33 ఏళ్లుగా చిన్న ప్రమా దం కూడా చేయని దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ జీఎన్‌ రెడ్డి, మిర్యాలగూడకు చెందిన ఏఎ్‌సఎన్‌ రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన కేఆర్‌రెడ్డిలతో పాటు, హయత్‌నగర్‌-1, చెంగిచెర్ల డిపోలకు నగదు రివార్డులు, అవార్డుల అందజేశారు. 

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితం అనే సందేశాన్ని రోడ్డు భద్రతావారోత్సవాల సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం హర్షణీయమన్నారు. తాను రవాణాశాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సంస్థలో 55 రోజుల సమ్మె జరిగిందని, సమ్మె కాలంలో ఏ రోజూ కూడా కంటి నిండా నిద్రలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగి ఎవరూ కూడా చనిపోవద్దని, నైపుణ్యం ఉన్న డ్రైవ ర్లు డ్యూటీలో లేకపోవడం వల్ల ఎక్కడ కూడా.. ఏ ప్రమాదం జరుగకూడదని టెన్షన్‌ పడ్డానన్నారు. సుశిక్షిత డ్రైవర్ల ప్రాధాన్యం తనకు తెలుసునన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు, డ్రైవర్లపై ప్రజలకు అత్యంత నమ్మకం ఉందని, అనేకమంది ప్రజల సెంటిమెంట్లు ఆర్టీసీతో ముడిపడి ఉన్నాయని అన్నారు. తాగి వాహనా న్ని నడపవద్దని, నియంత్రణ లేని వేగం వద్దని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించి వాహనాన్ని నడపాలని, సీటుబెల్ట్‌ పెట్టుకుని కారు నడపాలని సూచించారు. ఓవర్‌లోడ్‌తో ప్రైవేటు వాహనాలు నడపడంవల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని నివారించే దిశగా ప్రభుత్వం, అధికారులు పని చేయాల్సి ఉందన్నారు.

సంస్కృతికి చిహ్నం: సీపీ

నగర పోలీ్‌సకమీషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ పోలీస్‌ విభాగం రవాణా శాఖ తో కలిసి నగరంలో వాయు, ధ్వని కాలుష్యం లేకుండా చేయడంలో కృషి చేయనున్నామన్నారు. ఆర్టీసీతో కలిసి పనిచేసి నగరంలో ఒక్క ప్రమాద మరణం లేకుండా కృషి చేస్తామన్నారు. తాను విద్యార్థిగా ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నానన్నారు. అసలు సమాజ సంస్కృతి అంటే ఏమిటో ఆర్టీసీ బస్సుల ద్వారా అవగతమవుతుందన్నారు. ఆడవారు వస్తే వారికి సీటు ఇవ్వడం, పెద్దలు వస్తే వారికి తమ సీట్లను ఇవ్వడం, పిల్లలను తమ పక్కన స్థలం లేకున్నా కూడా కూర్చోబెట్టుకోవడం వంటి సంఘటన లు సమాజ మర్యాదలు, విలువలు తెలియజేస్తాయని అన్నారు. 

తాను ఆర్టీసీబస్సులో ప్రయాణం చేస్తున్న రోజుల్లో రామ్‌చందర్‌ అనే ఆర్టీసీ డైవర్‌ బస్సులో సిగరెట్‌ తాగుతున్న విద్యార్థిని స్మోకింగ్‌ ఆపకపోతే ‘మీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తానని’ చెప్పారని, ఆ తర్వాత అలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. రవాణాశాఖ కమిషనర్‌ సందీ్‌పకుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ ఆర్టీసీ అంటే ఒక లైఫ్‌లైన్‌ అని, ఏడాదిలో దాదాపు 360 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ప్రమాదాల్లో కేవలం 227 మంది మాత్రమే చనిపోయారంటే.. ఎంతటి రక్షణాత్మక రవాణా వ్యవస్థో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఐటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏ. పురుషోత్తం, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కె. రాజేంద్రప్రసాద్‌, ఆర్టీసీ ఈడీ యాదగిరి, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-02T05:46:43+05:30 IST