ప్రగతి భవన్‌ చేరుకున్న కేసీఆర్.. కాసేపట్లో కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-06-18T21:41:36+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

ప్రగతి భవన్‌ చేరుకున్న కేసీఆర్.. కాసేపట్లో కీలక ప్రకటన!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు , మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు భేటీ అయ్యారు. లాక్ డౌన్ సడలింపుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై కీలకంగా చర్చిస్తున్నారు. కాగా.. తెలంగాణలో జూన్ 19తో లాక్‎డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది.


ఏం ప్రకటిస్తారో..!?

అయితే.. 20 తర్వాత లాక్‎డౌన్ పూర్తిగా ఎత్తేయాలా..? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా..? అనేదానిపై ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చించి ఇవాళే కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్‎లాక్‎కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం అన్‎లాక్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. జులై -01 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని విషయాలపై ఇవాళ రాత్రిలోపు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఎవరెక్కడికో..!?

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు ఎప్పుడో రంగం సిద్ధమైంది. ఈ మేరకు జాబితా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని , కేసీఆర్‌ సంతకమే తరువాయి అని ప్రభుత్వ వర్గాల సమాచారం. అదనపు బాధ్యతలు తొలగించి, ఒక్కో అధికారికి ఒకే ఒక్క ప్రధాన శాఖ అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సీనియర్‌ అధికారి వద్ద పొంతన లేని వేర్వేరు శాఖలు ఉన్నాయి. దీంతో ఎవర్ని ఎక్కడికి బదిలీ చేస్తారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో గత ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 50 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేయడం, అదనపు బాధ్యతలు అప్పగించడం వంటివి జరిగాయే తప్ప... పెద్దగా బదిలీలు జరగలేదు.

Updated Date - 2021-06-18T21:41:36+05:30 IST