పోడు భూముల పై ఈనెల 23న కేసీఆర్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-10-19T01:22:14+05:30 IST

పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారం ప్రధాన అంశాలుగా చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈనెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

పోడు భూముల పై ఈనెల 23న కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారం ప్రధాన అంశాలుగా చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈనెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30గంటలకు సమావేశం జరుగుతుంది. ఒక రోజంతా సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిష్కరించడంతో పాటు అడవి త రిగి పోకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యల గురించి చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేస్తారు. హరితహారం ఫలితాలను అంచనా వేస్తూ మరింత విస్తృత స్థాయిలో ఫలితాలను రాబట్టడం కోసం చేపట్ట వలసిన భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. 


ఈ సమావేశంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ , పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంబందిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డిఎఫ్‌ఓలతోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొంటారు. కాగా తనెల 20, 21, 22 తేదీలలో పోడు భూముల సమస్యను అధ్యయనం చేయడం కోసం క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినాజెడ్‌చోంగ్తూ, పిసిసిఎఫ్‌ శోభలతో కూడిన అధికార బృందం హెలికాప్టర్‌ ద్వారా సంబంధిత అటవీ ప్రాంతాలను సందర్శించి పరిశీలన చేస్తారు. 


Updated Date - 2021-10-19T01:22:14+05:30 IST