పూటకో మాట.. రోజుకో బాట

ABN , First Publish Date - 2021-11-18T08:57:12+05:30 IST

‘‘పూటకో మాట, రోజుకోబాట.. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహారశైలి. ఆయన అంతరంగం అర్థమైతే ఒట్టు! అంచనా వేద్దామంటే ఆకుకు అందదు..

పూటకో మాట.. రోజుకో బాట

  • రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తీరు!
  • సాగు చట్టాలు తేనె పూసిన కత్తులని ఒకసారి!
  • ఆ చట్టాలు ఉత్తమమంటూ మరోసారి
  • ‘పంట వేయమన్న నేనే ఇంట్లో పంటనా?..
  • అదనంగా ఇచ్చిమరీ కొంటామ’ని భరోసా
  • ధాన్యం కొనడానికి సర్కారు రైస్‌ మిల్లరో,
  • దాల్‌మిల్లరో కాదని అంతలోనే వ్యంగ్యం
  • నియంత్రిత సాగు ఉండబోదన్న కొన్నాళ్లకే..
  • వరి వేస్తే ఉరేనంటూ అనధికారిక నిషేధం
  • సీఎం వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు
  • ‘ధర్నా చౌక్‌’ వద్ద నేడు టీఆర్‌ఎస్‌ ధర్నా


(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి): ‘‘పూటకో మాట, రోజుకోబాట.. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహారశైలి. ఆయన అంతరంగం అర్థమైతే ఒట్టు! అంచనా వేద్దామంటే ఆకుకు అందదు.. పోకకు పొందదు. ఎప్పుడేం మాట్లాడుతారో? ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో? తెలియదు! యుద్ధమంటారో లేక యుద్ధం శుద్ధదండుగని కాడి కిందపడేస్తారో అంచనా వేయడం కష్టం’’ ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహారశైలిపై సర్వత్రా వినిపించే, వినిపిస్తున్న విమర్శలివి! ‘‘రాష్ట్రంలో ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ బుధవారంరాసిన లేఖ, గురువారం టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహాధర్నా నేపథ్యంలో ఈ అంశంపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మరోసారి చర్చకు వస్తున్నాయి. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌పై ఒకప్పుడు నిషేధం విధించిన ఇదే టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగడం కేసీఆర్‌ మార్కు యూటర్న్‌లకు ఉదాహరణ అని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అదీ కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ఈ ధర్నా తలపెట్టడంతో సాగుచట్టాలపై కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఉదాహరణకు.. సాగుచట్టాలకు వ్యతిరేకంగా 2020 డిసెంబరు 8న రైతులు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు కేసీఆర్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. ‘‘వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు నిర్వహించే దేశవ్యాప్త బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. పార్టీ శ్రేణులన్నీ బంద్‌లో పాల్గొనాలి’’ అని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు. అదే కేసీఆర్‌.. సరిగ్గా 20 రోజుల తర్వాత.. అంటే 2020 డిసెంబరు 27న ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పక్కా యూటర్న్‌ తీసుకున్నారు. ‘‘పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర  వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి. ఈ విధానం ఉత్తమం’’ అని వ్యాఖ్యానించారు.


నియంత్రిత సాగుపైనా..

ధాన్యం కొనుగోళ్లు, నియంత్రిత సాగు, పంట మార్పిడి వంటి అంశాలపైనా సీఎం కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో చేసిన భిన్నమైన వ్యాఖ్యలు రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని ఒకసారి కొంటామని.. మరోసారి కొనబోమని.. వరి వేస్తే ఉరేనని, నియంత్రిత సాగు విధానం ఉంటుందని ఒకసారి.. ఉండదని మరోసారి.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఉదాహరణకు.. ‘‘పంట వేయాలని చెప్పిన నేనే ఇంట్లో పంటనా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ ఆంక్షలను అధిగమించి న్యాయం చేస్తం. గింజ కూడా బయట అమ్మొద్దు. ఊర్లకొచ్చి కొంటం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు దుర్మార్గం. ఈ బిల్లు మీద ఉత్తరాది అట్టుడుకుతోంది. దసరానాడు రాంలీలా మైదానంలో రావణుడికి బదులు ప్రధాని బొమ్మను కాల్చిన్రు. 


ఆ చైతన్యం మనలోనూ రావాలి. పిడికిలి బిగించాలి. ఈ వానాకాలంలో రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.100-150 దాకా అదనంగా ఇస్తాం’’ అని కొడకండ్ల రైతు వేదిక ప్రారంభం సందర్భంగా 2020 అక్టోబరు 31న హామీ ఇచ్చిన సీఎం.. రెణ్నెల్లు తిరక్కుండానే మాట మార్చేశారు. ‘‘పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్‌మిల్లరో, దాల్‌మిల్లరో అసలే కాదు. కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. మద్దతు ధరతో కొనుగోళ్లు జరపడం ద్వారా ప్రభుత్వానికి రూ.7500 కోట్ల నష్టం వచ్చింది’’ అని ఆ ఏడాది డిసెంబరు 27న ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో తేల్చిచెప్పారు. నియంత్రిత సాగు విధానం ఉండబోదని.. రైతులు ఏ పంటలు వేయాలనే విషయమై వారే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆ సమీక్షలో తేల్చిచెప్పిన సంగతీ తెలిసిందే. కానీ.. కొద్దిరోజులుగా ప్రభుత్వం వరి సాగుపై అనధికారిక నిషేధం విధించిన విషయమూ విదితమే. వరిసాగుకు వ్యతిరేకంగా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం మీడియాలో వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇలా పదేపదే మాట మార్చడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఇందులో విచిత్రమేమీ లేదని, కేసీఆర్‌ తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి వ్యాఖ్య వెనుక రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


నేడు 11 గంటల నుంచి టీఆర్‌ఎస్‌ మహా ధర్నా

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలంటూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, డీసీఎంఎస్‌ల చైర్మన్లు పాల్గొంటారు. అనంతరం గవర్నర్‌కు మెమొరాండంను అందజేస్తారు.


‘‘వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి. రైతులను దెబ్బతీసి కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో పేర్కొన్నారు. వాస్తవానికి ఇది వ్యాపారులకు ఉపయోగపడే విధానం. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. అది సాధ్యమేనా? రైతులోకానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న ఈ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించండి’’

- 2020 సెప్టెంబరు 19న టీఆర్‌ఎస్‌ 

పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు సీఎం కేసీఆర్‌ చేసిన దిశానిర్దేశమిది.


‘‘ఈ వానాకాలంలో రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాకు చెల్లిస్తున్న రూ.1888కి మరో రూ.100-150 దాకా అదనంగా ఇస్తాం. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 2% కూడా సన్న వరి కోయలేదు. ఈ మొదటివారంలో సన్నాలు వస్తయ్‌. ఏం చేయాలో నేను చేయనా? పంట వేయాలని చెప్పిన నేనే ఇంట్లో పంటనా? దేశంలో ఏ రాష్ట్రమూ ధాన్యాన్ని కొనట్లేదు. రైతుల దగ్గర ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనే ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

- 2020 అక్టోబరు 31న కొడకండ్లలో 

నిర్వహించిన రైతు ఆత్మీయ 

సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌


‘‘కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే.. మానవతా దృక్పథంతో ఈ ఏడాది గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పంటల్ని కొనుగోలు చేసింది. ప్రతిసారీ అలా సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. కాబట్టి వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి.’’

- కొడకండ్లలో రైతు ఆత్మీయ సభ తర్వాత మాటమార్చి కొనుగోళ్లు లేవని తేల్చిచెప్పిన కేసీఆర్‌. సాగు చట్టాలపైనా యూటర్న్‌!!

Updated Date - 2021-11-18T08:57:12+05:30 IST