చెరువులకు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి- సీఎం

ABN , First Publish Date - 2020-10-21T21:22:02+05:30 IST

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు ఆదేశించారు.

చెరువులకు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి- సీఎం

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ , అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌తో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.


 ‘‘ హైదరాబాద్‌ నగరంలో గత వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో పెద్దయెత్తున వరద నీరు వచ్చింది. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారాకూడా చాలా నీరు నగరంలోని చెరువులకు చేరింది. నగరంలోని చెరువులన్నీపూర్తిగా నిండిపోయాయి. ఇంకా  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండిపడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలుజరిగే అవకాశం వుంది. 


కాబట్టి నీరుపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్తలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

Updated Date - 2020-10-21T21:22:02+05:30 IST