కేంద్రం తీరును ఎండగట్టండి

ABN , First Publish Date - 2021-11-29T08:06:16+05:30 IST

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం తీరును ఎండగట్టాలని, పార్లమెంటు వేదికగా..

కేంద్రం తీరును ఎండగట్టండి

  • ధాన్యం సేకరణలో అంతా అస్పష్ట విధానం
  • సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం ఉండాలి
  • పార్లమెంట్‌ వేదికగా నిలదీయండి
  • టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
  • రైతుల తరఫున గళం విప్పుతామన్న టీఆర్‌ఎస్‌పీపీ
  • కేంద్రం సమాధానం చెప్పాల్సిందే: నామా


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం తీరును ఎండగట్టాలని, పార్లమెంటు వేదికగా నిలదీయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణలో స్పష్టత కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు.


‘‘వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతున్నది. రాష్ట్రం నుంచి 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, కేవలం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని (40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని మళ్లీ పాతపాటే పాడుతున్నది. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో జాతీయ సమగ్ర విధానం ఉండాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏకరీతి విధానాన్ని అనుసరించాలి. ఈ విషయాలపై ఉభయ సభల్లో ప్రస్తావించాలి’’ అని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని టీఆర్‌ఎ్‌సపీపీ డిమాండ్‌ చేసింది. తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ను, అటు సీఎ్‌సతో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా.. ధాన్యం కొనుగోళ్లపై ఎటూ తేల్చకపోవడం సరికాదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉభయ సభల్లో రాష్ట్ర రైతాంగంతరఫున గళాన్ని వినిపించాలని, కేంద్రం తీరుపై  పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత కె.కేశవరావు, పార్టీ ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పి.రాములు, పి.దయాకర్‌, మాలోత్‌ కవిత, బి.వెంకటేశ్‌నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నేడు మంత్రి మండలి భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు  ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటి జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. మంత్రిమండలి సమావేశంలో వరిసాగు, ఽధాన్యం సేకరణ, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రొత్సాహించడంపై  చర్చించనున్నారు. ప్రధానంగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వ్యాప్తి, కట్టడి, ప్రభుత్వ సన్నద్ధతపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పోడు భూములపై క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపైనా మంత్రిమండలిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టీసీ, కరెంటు చార్జీల పెంపు అంశంపైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పాలసీపరమైన విధాన నిర్ణయాలు ఉండవని సమాచారం. 




సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-11-29T08:06:16+05:30 IST