ఉద్యమకారులను గుర్తించని సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-30T05:36:01+05:30 IST

తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను కేసీఆర్‌ గుర్తించడం లేదని, దొడ్డి దారిన పన్నెండేళ్లు ఎమ్మెల్సీగా పని చేసిన భానుప్రసాద రావు ఏం చేశాడని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించారు.

ఉద్యమకారులను గుర్తించని సీఎం కేసీఆర్‌
మాట్లాడుతున్న రవీందర్‌సింగ్‌

- ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌ 

పెద్దపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను కేసీఆర్‌ గుర్తించడం లేదని, దొడ్డి దారిన పన్నెండేళ్లు ఎమ్మెల్సీగా పని చేసిన భానుప్రసాద రావు ఏం చేశాడని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించారు. సోమవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2006లో అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌ అర్జున గుట్టకు వెళ్ళిన సందర్భంగా అక్కడ దేవుడి సాక్షిగా తనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని చెప్పారని, అంతేకాకుండా మరో మూడుసార్లు కూడా తాను అడకున్నా కూడా అదే హామీ ఇచ్చారని గుర్తుచేవారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశమిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈసారి తాను పోటీకి ఇప్పుడు కనిపిస్తున్న కేసీఆర్‌, ఒకప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌ కాదని ఎద్దేవా చేశాడు. టీఆర్‌ఎస్‌లో యూటీ బ్యాచ్‌, బీటీ బ్యాచ్‌తో పాటు ఇప్పుడు కొత్తగా మెయింటెనెన్స్‌ బ్యాచ్‌ పుట్టుకు వచ్చిందన్నారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో గుర్తించలేని స్థితిలో కేసీఆర్‌ ఉన్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ‘ఆకలితోనైనా చస్తాం గానీ, ఆత్మగౌరవాన్ని చంపుకోలేం’ అని మాట్లాడిన కేసీఆర్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మంత్రి పదవులు చేసేందుకు ఉద్యమకారులు లేరా అని అన్నారు. కేసీఆర్‌ తిట్టి పోసిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉద్యమకారులపై కేసులు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసి 18 గంటలనైనా గడవక ముందే ఎమ్మెల్సీ పదవి పొందిన వెంకట్రామిరెడ్డి, మానుకోటలో ఉద్యమ కారులపై రాళ్లు విసిరిన పాడి కౌశిక్‌ రెడ్డిలకు పదవులు కట్టబెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. 

సమీకరణాల పేరుతో ఉద్యమకారులను అణచి వేస్తున్నారని, పొమ్మనలేక పొగ బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ మేయర్‌గా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రూపాయికే నల్లా కనెక్షన్‌, దహనసంస్కారాల వంటి పథకాలతో దేశంలోనే గుర్తింపు తెచ్చానన్నారు. ఉద్యమకారులకు పదవులు ఇస్తే పాలన బాగా సాగదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన భానుప్రసాద రావు ఏనాడూ తెలంగాణ తల్లి విగ్రహానికి పుల దండ వేయలేదని, అమర వీరులకు నీరాజనాలు అర్పించలేదన్నారు. తన వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఒక్కనాడు కూడా ఎంపీటీసీల గురించి పట్టించుకోలేదన్నారు. చట్టసభల్లో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ జరిగితే గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీలకు, మండల పరిషత్‌లో జడ్పీటీసీలకు కుర్చీలు ఎందుకు వేయడం లేదని మాట్లాడాడా, వారికి విధులు, నిధులు ఇచ్చేందుకు కృషి చేశాడా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేయలేదని, కనీసం 12 గంటలు కూడా ఉండ లేని పరిస్థితి ఆయనదని విమర్శించారు. ఏ ఒక్క రోజు కూడా ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆత్మ గౌరవం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తన నామినేషన్‌ను కొట్టి వేయించేందుకు అనేక కుట్రలు పన్నారన్నారు. తనను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు బలపరిచారన్నారు. తాను పోటీలో ఉండాలని అనేకమంది ఎంపీటీసీలు ఫోన్లు చేశారన్నారు. ఎలాగైనా తాము ఏకగ్రీవంగా ఎన్నికవుతామని టీఆర్‌ఎస్‌ ప్రతినిధులను 26వ తేదీ వరకు మాత్రమే క్యాంపునకు పట్టుకెళ్లారని, పోటీ అనివార్యం కావడంతో ఎన్నడూ వారిని పలకరించని అభ్యర్థులు క్యాంపునకు తరలించారన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయమని, ఆత్మగౌరవం గెలుస్తుందన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు చేశారని తనపై కేసు పెట్టారని, ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆంధ్రా నుంచి డబ్బుల మూటాలు వస్తాయని అవి తీసుకుని ఆత్మగౌరవం కోసం తెలంగాణకు ఓటెయ్యాలని మాట్లాడిన మాటలను ఆయన గుర్తు చేశారు. నేను ఏ పార్టీలో లేనని, అన్ని పార్టీలు నా వెనుక ఉన్నాయని రవీందర్‌ సింగ్‌ అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ నర్సింగరావు, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ సాధవేని శ్రీనివాస్‌, ఉద్యమకారుడు కర్రె రాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T05:36:01+05:30 IST