వణికిస్తున్న జవాద్‌

ABN , First Publish Date - 2021-12-04T07:35:46+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాలను ‘జవాద్‌’ తుఫాన్‌ వణికిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. దీనికి సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్‌’ ..

వణికిస్తున్న జవాద్‌

  • నేటి ఉదయం విశాఖకు సమీపంగా రాక 
  • దిశ మార్చుకొని తీరానికి ఆనుకుని పయనం 
  • రేపు ఉదయం సోంపేట, పూరి మధ్య తీరం దాటే అవకాశం
  • నేటినుంచి ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షాలు 
  • గంటకు 80-100 కి.మీ. వేగంతో గాలులు
  • రేపు శ్రీకాకుళంలో కుంభవృష్టి ప్రాణనష్టం ఉండకూడదు
  • తుఫాన్‌పై కలెక్టర్లకు సీఎం ఆదేశాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఉత్తరాంధ్ర జిల్లాలను ‘జవాద్‌’ తుఫాన్‌ వణికిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. దీనికి సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్‌’ అనే పేరు పెట్టారు. ఈ తుఫాన్‌ ప్రస్తుతం గంటకు 22 కి.మీ. వేగంతో పయనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నానికి విశాఖపట్నానికి 300 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 420 కి.మీ. దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. ఈ క్రమంలో విశాఖకు 100 నుంచి 150 కి.మీ. సమీపానికి వస్తుంది. అక్కడనుంచి ఉత్తర వాయవ్యంగా దిశ మార్చుకుని తీరానికి ఆనుకుని కొన్ని గంటలు పయనించి ఒడిసా వైపు వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా లేదా వాయుగుండంగా మారి ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా సోంపేట, ఒడిసాలోని పూరి మధ్య గల ‘రంభ’ పరిసరాల్లో తీరం దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ విశాఖ తీరం వైపు వచ్చేకొద్దీ అంటే శుక్రవారం రాత్రి నుంచి 75-85 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో పాటు వర్షాలు పెరుగుతాయి.


శనివారం తెల్లవారుజామున గాలుల ఉధృతి గంటకు 80నుంచి 90, అప్పుడప్పుడు 100కి.మీ., ఉదయం గంటకు 90నుంచి 100, అప్పుడప్పుడు 110కి.మీ. వేగంతో వీస్తాయి. శనివారం ఉదయం నుంచి విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా అసాధారణ వర్షాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాంలలో భారీ నుంచి అతిభారీ, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 4వ నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలలో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 


యంత్రాంగం సన్నద్ధం 

తుఫాన్‌ హెచ్చరికలతో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యా సంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. విశాఖలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బడులకు సెలవు ఇవ్వగా శనివారం కూడా పాఠశాలలు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్రకు 11ఎన్డీఆర్‌ఎఫ్‌, 3 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు, మరో 4బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 


ముందస్తు సహాయక చర్యలు 

తుఫాన్‌ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 12 తీరప్రాంత మండలాల్లోని 237 లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, తుఫాన్‌ పర్యవేక్షణ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌ నేతృత్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయనగరంలో శుక్రవారం సాయంత్రానికి చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. భారీవర్షాలతో పంటకు తీవ్రనష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గింపునకు నిర్ణయం 

జవాద్‌ తుఫాన్‌ నేపఽథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని విభాగాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉత్పత్తి తగ్గించాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నిర్ణయించింది. తుఫాన్‌పై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ప్లాంట్‌లోని మూడు బ్లాస్ట్‌ఫర్నే్‌సలలో రెండింటినే నడపాలని, కోక్‌ఓవెన్స్‌ విభాగంలో పుషింగ్స్‌(ఉత్పత్తి) తగ్గించాలని నిర్ణయించారు. 


అప్రమత్తంగా ఉండండి: ఐఎండీ 

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు దక్షిణ ఒడిసాకు ‘జవాద్‌’ తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరో తేదీ నాటికి ఏపీ, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, తుఫాన్‌ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ప్రధాని మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీతో పాటు ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు 64 బృందాలను పంపనున్నట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ వెల్లడించారు.

Updated Date - 2021-12-04T07:35:46+05:30 IST