Advertisement
Advertisement
Abn logo
Advertisement

సర్కారు అప్రమత్తం

  • ప్రాణనష్టం ఉండకూడదు
  • సిబ్బందిని సిద్ధంగా ఉంచండి
  • తుఫాన్‌పై కలెక్టర్లకు సీఎం ఆదేశాలు


అమరావతి, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): ‘‘జవాద్‌ తుఫానువల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగొద్దు. అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుఫాను ప్రభావిత జిల్లాలకు రూ.10కోట్లు చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలన్నారు. సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదని, ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం  ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలి. మరోసారి అన్ని చోట్లా పరిస్థితుల్ని సమీక్షించుకోవాలి. ఇంకా అదనపు బృందాలను సిద్ధం చేయండి. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి... ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయండి. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయో చూడాలి. గండ్లు పడ్డాయని తెలిసినా, బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపట్టాలి’’ అని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనటానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని సీఎస్‌ సమీర్‌శర్మ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 కోస్ట్‌ గార్డ్‌ టీమ్‌లు, 10 మెరైన్‌ పోలీస్‌ బృందాలు, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌, 18 ఫైర్‌సర్వీస్‌ టీమ్‌లను ఆయా జిల్లాల్లో సిద్ధంగా ఉంచామని... సహాయ చర్యలకు 115 జేసీబీలు, 115 టిప్పర్లు, 232 నీళ్ల ట్యాంకులు, 295 జనరేటర్లు అందుబాటులో ఉంచామని వివరించారు. 46,322 టన్నుల బియ్యం, 1018 టన్నుల పప్పులు, 41 వేల లీటర్ల వంటనూనె, 391 టన్నుల పంచదార సిద్ధంగా ఉంచామని చెప్పారు.  అవసరమైతే 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేశామని సీఎస్‌ చెప్పారు.  ఈ సమీక్షలో హోంమంత్రి సుచరిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement