ఆరోగ్య రంగానికి సీఎం ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-29T06:16:09+05:30 IST

ఆరోగ్య రంగానికి ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంస్‌ఐడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

ఆరోగ్య రంగానికి సీఎం  ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎండీ డి.మురళీధర్‌రెడ్డి

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్య రంగానికి ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంస్‌ఐడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడం లక్ష్యంగా ‘నాడు-నేడు’ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. బీచ్‌రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల అధికారులతో ‘నాడు-నేడు’ పనులపై శుక్రవారం సమీక్ష  నిర్వహించారు.


రెండేళ్ల క్రితం చేపట్టిన పనులు కొవిడ్‌ కారణంగా ఆలస్యమయ్యాయని, నిధుల కొరత లేదన్నారు. రూ.16,253 కోట్లతో టెర్షిరీ సెంటర్లు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ మొత్తంలో రూ.10,033 కోట్లు వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లకు వెచ్చిస్తున్నామని చెప్పారు. కొత్త మెడికల్‌ కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.1720 కోట్లు  సేకరించామన్నారు. రూ.1200 కోట్లతో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు.


గిరిజన ప్రాంతాల్లో పనులు పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని, విజయనగరం మెడికల్‌ కళాశాలకు నిధులు మంజూరయ్యాయన్నారు. నాడు-నేడు పనులు చేసే కాంట్రాక్టర్లకు నిధులు చెల్లింపులో ఆలస్యం ఉండదన్నారు. నవంబరు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్‌ చేశామని, సాంకేతిక ఇబ్బందులు ఉన్న బిల్లులు పెండింగ్‌లో పెట్టామన్నారు. అనకాపల్లి మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సంబంధించి భూమి సమస్య ఉందని, దీనిపై కోర్టులో కేసు కొద్దిరోజుల్లోనే క్లియర్‌ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐదు జిల్లాలకు సంబంధించిన అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:16:09+05:30 IST