Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం ‘సెల్ఫీ టూర్‌!

  • నష్టంపై ఆరాల్లేవు..
  • అధికారులతో సమీక్షలూ లేవు
  • వరద సాయంపై ప్రకటనా లేదు
  • చిత్తూరు జిల్లాలో రెండ్రోజుల్లో పర్యటించింది 4 గంటలే!


తిరుపతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన సెల్ఫీ టూర్‌లా సాగింది. బాధితులకు పరామర్శలు, ఓదార్పులు, జరిగిన నష్టాల గురించి ఆరాల కంటే సెల్ఫీల హడావుడే ఎక్కువగా కనిపించింది. ఏం జరిగింది రైతన్నా అంటూ ఎక్కడా పొలంలోకి దిగి పరిశీలించలేదు. ప్రభుత్వం నుంచి ఫలానా సాయం చేస్తామన్న భరోసా ఇవ్వలేదు. పేరుకు 2రోజులైనా కేవలం 4గంటల పాటే పర్యటించి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో రెండుప్రాంతాలను సందర్శించి రాత్రి 8.20 గంటలకల్లా తిరుపతిలో పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. ఈ మూడు గంటల్లో ఆయన ముప్పావు గంట మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో గడిపారు. అదీ జరిగిన నష్టాన్ని చీకట్లోనే  చూశారు. ఇక శుక్రవారం ఉదయం 8.30గంటలకు అతిఽథి గృహం నుంచి బయటకు వచ్చిన సీఎం.. తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌, సరస్వతీనగర్‌, గాయత్రీనగర్‌లలో 3గంటలు గడిపారు. వీధుల్లో నడుస్తూ ఇళ్ల ముందు కనిపించిన ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. యంత్రాంగం సకాలంలో స్పందించి సాయం చేసిందా అని కనుక్కునే ప్రయత్నమూ చేయలేదు. తర్వాత తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై కూలిన బ్రిడ్జిని పరిశీలించారు.


అక్కడే వరదల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన తిరుచానూరు కానిస్టేబుల్‌, తిరుపతిలో గరుడ వారధి పనులు చేస్తున్న ఆఫ్కాన్స్‌ సంస్థ మేనేజర్‌, మరో ముగ్గురు తిరుచానూరువాసులను అభినందించడంతో పాటు శాలువాలు కప్పి సత్కరించారు. పాడిపేటలో 15 నిమిషాలు గడిపారు. అక్కడితో పర్యటన ముగించుకుని నేరుగా విమానాశ్రయం చేరుకుని మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాకు వెళ్లారు. ఆ జిల్లాలో పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి రేణిగుంట చేరుకుని 5.45గంటలకు విమానంలో విజయవాడ బయల్దేరి వెళ్లారు. 4గంటల పర్యటనలో మూడుచోట్ల ఫొటో ఎగ్జిబిషన్ల పరిశీలన, స్థానిక వైసీపీ నేతలతో పరిచయాలు, ఫొటో సెషన్లకే సుమారు ముప్పావు గంట సరిపోయింది. మిగతా 3.15 గంటలే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. అప్పుడు కూడా బాధితులకు భరోసా ఇవ్వడానికి బదులు వారితో ఫొటోలు దిగడం, సెల్ఫీలకే అధిక సమయం కేటాయించారు. జిల్లాలో 25 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే సీఎం కనీసం ఒక్కచోట కూడా దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదు. సాయంపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే వెనుదిరగడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా వారం క్రితం మాజీ సీఎం చంద్రబాబు పర్యటనను జనం గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు రేణిగుంట, ఏర్పేడు, తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల పరిధిలో పర్యటించారు.


అర్ధరాత్రి ఒంటిగంట వరకూ తిరుపతిలో బురద నిండిన వీధుల్లో తిరిగి బాధితులను పరామర్శించారు. సాయం అందేవరకూ ప్రభుత్వంపై పోరాడతామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున, పార్టీ తరఫున చేతనైన సాయం అందిస్తామన్నారు. భద్రతాధికారులు వద్దని వారించినా వినకుండా ప్రమాదకర స్థితిలో ఉన్న రాయలచెరువు కట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు. పలువురు బాధితులకు పార్టీ తరపున ఆర్థిక సాయం కూడా అందించారు. 

Advertisement
Advertisement