ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఎదుర్కోండి

ABN , First Publish Date - 2021-11-27T14:41:23+05:30 IST

లైంగిక వేధింపులకు గురయ్యే యువతులు, బాలికలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని మహోన్నతులుగా మారాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళల

ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఎదుర్కోండి

- మహిళలకు CM పిలుపు

- లైంగిక వేధింపులు సిగ్గుచేటు


చెన్నై: లైంగిక వేధింపులకు గురయ్యే యువతులు, బాలికలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని మహోన్నతులుగా మారాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళల లైంగికవేధింపుల వ్యతిరేకదినం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇటీవలి కాలంలో లైంగిక వేధింపులకు గురవుతున్న యువతులు, బాలికలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే వార్తలు విన్నప్పుడు తాను ఎంతో ఆవేదన చెందుతున్నానన్నారు. సమాజంలో, విద్య, ఉపాధి అవకా శాలు కల్పించడంలో అభివృద్ధి చెందిన దేశంలో, వైజ్ఞానిక, సాంకేతికపరంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్న కాలంలో సభ్యసమాజం తలదించుకునేలా లైంగిక వేధింపులు జరుగుతుండటం సిగ్గుచేటైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు గురైన ఓ బాలిక తన తండ్రి వద్ద విడిచిపెట్టవద్దు అంటూ పెట్టిన గావుకేక తన మనస్సును కలచివేసిందన్నారు. లైంగికవేధింపులను, అత్యాచారాలను నిరోధించేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాల ముందు నేరస్థులను నిలబెట్టి కఠినంగా శిక్షించడానికి తాము వెనుకాడబోమని సీఎం స్పష్టం చేశారు. లైంగిక వేధింపులకు, హింసకు గురయ్యే యువతులు, బాలికలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలన్నారు. లైంగిక వేధింపులు ఎదర్కొంటున్న వారు 1098 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని మహిళలు, బాలికలను ముఖ్యమంత్రిగా కాకుండా ఓ తండ్రిలా వేడుకుంటున్నానని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. 


వర్షబాధిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పరిశీలన

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం నగరంలో వర్షబాధిత ప్రాంతాలను పరిశీలించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన భారీ వర్షాలకు నగరం జలమయ మైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులతో కలిసి స్థానిక పులియంతోపు వద్ద వర్షబాధిత ప్రాంతాలను సందర్శించారు. తిరువికానగర్‌ 73వ వార్డు స్టీపన్‌సన్‌ రోడ్డు వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన నిర్మాణ పనులను స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత శివ ఇలంగో రోడ్డు, పెరవళ్లూరు పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న ప్రాంతాలు, అశోకా అవెన్యూ ప్రాంతాల్లో మోటారు పంపులతో వాననీటిని తొలగించే పనులను తనిఖీ చేశారు. అక్కడి నుంచి కాలినడకనే కొళత్తూరు జీకేఎం కాలనీలో కొలను మరమ్మతు పనులను, జలమయమైన కందసామి రోడ్డును పరిశీలించారు. స్టాలిన్‌ వెంట మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, ఎంపీ దయానిధి మారన్‌, ఎమ్మెల్యేలు తాయగం కవి, ఇ. పరంధామన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ, పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ పర్యటించారు.

Updated Date - 2021-11-27T14:41:23+05:30 IST