Abn logo
May 28 2020 @ 12:40PM

అమలు కాని జగన్ తొలి హామీ.. నాడు సొంత జిల్లాలో పాదయాత్రలో...

ఒక్క రూపాయి జీతం పెంచలేదు...

రెగ్యులర్‌పై ఉలుకూపలుకు లేదు

తీవ్ర ఆందోళనలో ఆర్టీపీపీ, ట్రాన్స్‌కో కాంట్రాక్టు కార్మికులు

అధికారం చేపట్టి సంవత్సరం దాటినా అమలుకాని సీఎం బహిరంగ సభ హమీ 


ఎర్రగుంట్ల / కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘నేనున్నాను... మన ప్రభుత్వం రాగానే ఆర్టీపీపీ, ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో విద్యుత్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరికి ఒక పద్ధతి పెడతాం.. ఆ పద్ధతి ప్రకారం అందరిని రెగ్యులర్‌ చేస్తాం. పద్ధతి పెట్టి ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడతా.. మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు..’’ ఇది ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 9 నవంబర్‌ 2017న ఎర్రగుంట్ల నాలుగురోడ్ల వద్ద ప్రజల హర్షధ్వానాల మధ్య ఇచ్చిన తొలి హామీ. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరో వైపు ఏపీ జెన్‌కోను ప్రభుత్వం నిర్వీర్వం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్టీపీపీతో పాటు రాష్ట్రంలోని ఇతర విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్శింగ్‌ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


రాయలసీమకే తలమానికం ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు. ఇందులో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని జిల్లాలో వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన తొలిహామీ. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా పాదయాత్రలో తమను రెగ్యులర్‌ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు పట్టించుకోలేదని, అయితే చివరలో కనీసం జీతాలైనా పెంచారని కార్మికులు అంటున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయకపోగా.. ఆర్టీపీపీని ఎన్‌టీపీసీలోకి విలీనం చేస్తారనే విషయం వీరందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడి ఇంజినీర్లను ఇతర ప్లాంట్లకు, టీబీ డ్యాం, తాడిపత్రి సోలార్‌ప్లాంటుకు బదిలీచేస్తున్నారు. దీంతో తమ రెగ్యులర్‌ విషయం అటు ఉంచితే ఉన్న ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అనే భయం కార్మికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఆర్టీపీపీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగేనా..?

2017 నవంబర్‌ 5న ఇడుపులపాయ నుంచి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. 9న ఎర్రగుంట్లలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. అంతకు ముందే ఆర్టీపీపీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలసి తమను రెగ్యులర్‌ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో జిల్లాకు సంబంధించి ఇచ్చిన తొలి హామీ ఇది. వీరితో పాటుగా ఏపీ జెన్కో, ట్రాన్స్కో, ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులను కూడా రెగ్యులర్‌ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆర్టీపీపీకి 1989లో నాటి సీఎం ఎన్టీఆర్‌ పునాదిరాయి వేశారు. 1995లో నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 1650 మెగావాట్లు. ఆ సంస్థలో 15-18 ఏళ్లుగా సుమారుగా 1,350 మంది కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఏజెన్సీ ద్వారా వేతనాలు ఇస్తున్నారు. వీరితో పాటు జిల్లాలో డిస్కమ్‌, ట్రాన్స్‌కోలో మరో 3000 మందికి పైగా పనిచేస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. గత ఏడాది మే 30న జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ చేస్తారని వీరంతా ఆశించారు. అయితే.. ఆదిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఎందరికో ఉపాధి చూపుతున్న ఆర్టీపీపీని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ)లో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహానికి కారణమయింది. తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని, ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయవద్దంటూ ఐదు నెలల క్రితం రోడ్డెక్కారు. డిసెంబర్‌ 23న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జరిగిన ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సభలో ఆర్టీపీపీ కార్మికులు, ఉద్యోగులు తమ గోడును విన్నవించాలని వస్తే కనీసం పలరింపు కూడా లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని, అప్పటి వరకు ఏజెన్సీ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారా తమ ఖాతాల్లో జీతాలు జమ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో జగన్‌ ఇచ్చిన తొలి హామీ అమలు చేస్తారా..? లేదా..? వేచి చూడాల్సిందే. 


హామీ నెరవేర్చాలి..: శివారెడ్డి, ట్రాన్స్‌కో కాంట్రాక్టు కార్మిక నాయకుడు

కాంట్రాక్టు విధాన్ని పూర్తిగా రద్దుచేయాలి. బోర్డుద్వారా జీతాలు ఇవ్వాలి. రెండు దశాబ్దాలనుంచి కాంట్రాక్టు కార్మికులుగా అతితక్కువ జీతానికి పనిచేస్తూ కొందరు త్వరలో రిటైర్‌ అవ్వబోతున్నారు. సంస్థలకోసం అహర్నిశలు పనిచేశారు. వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎ్‌స జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల గురించి అనర్గళంగా ప్రస్తావించారు. పాదయాత్రలో మేము వినతి పత్రం ఇచ్చిన సందర్భంలో కూడా గట్టి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నెరవేర్చి అందరికి వెలుగును ఇస్తున్న మా జీవితాలలో సీఎం వెలుగునింపాలి.


20ఏళ్లుగా పనిచేస్తున్నా నిరాశే..: సాంబశివారెడ్డి, ఏపీజెన్కో, కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌, సెక్రటరీ

ఆర్టీపీపీలో 20ఏళ్లుగా కాంట్రాక్టు కింద పనిచేసేవారున్నారు. చాలీచాలని జీతాలతో, కుటుంబపోషణ భారమై బతుకుబండిని ఈడ్చేవారున్నారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఈ జీతాలు సరిపోవు. ప్రస్తుతం ఆర్టీపీపీలో సుమారు 1350మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఎర్రగుంట్లలో పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌కు వినతిపత్రాన్ని ఇచ్చాం. అదేవిషయాన్ని ఆరోజు సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికలోకం ఎంతో సంతోషించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మంత్రిద్వారా, ఉన్నతాధికారుల ద్వారా సీఎం దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు రెగ్యులర్‌ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం బోర్డుకింద తీసుకుని జీతాలైనా నేరుగా ఇవ్వాలని కోరాం అయినా స్పందనలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దయతలచి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Advertisement
Advertisement
Advertisement