ప్రైవేట్‌ రంగానికి 88బొగ్గుగనులు

ABN , First Publish Date - 2021-10-15T06:12:07+05:30 IST

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 88 బొగ్గుగనులను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంబించింది.

ప్రైవేట్‌ రంగానికి 88బొగ్గుగనులు

సింగరేణి నాలుగు గనులు కూడా..

ఇల్లెందు, అక్టోబరు14: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 88 బొగ్గుగనులను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంబించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు బొగ్గు గనులను కూడా ప్రైవేట్‌రంగానికి అప్పగించేందుకు టెండర్ల తెరతీయడం కోల్‌బెల్ట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అక్టోబరు12న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టెండర్ల ప్రక్రియలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు డివిజన్‌లోని కోయగూడెం బ్లాక్‌ 3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్‌ 3, మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణఖని బ్లాక్‌6. ఆసిఫాబాద్‌ జిల్లా శ్రావణపల్లి బొగ్గుగనులను కూడా చేర్చడం గమనార్హం. సింగరేణి కాలరీస్‌లో కార్మికులు రేయంబవళ్లు చెమడోచ్చి, యజమాన్యం దాదాపు రూ.80కోట్ల వ్యయంతో జరిపిన అన్వేషణల ఫలితంగా రూపుదిద్దుకున్న నాలుగు బొగ్గుగనులను కేంద్రం ప్రవేట్‌రంగానికి అప్పగించాలని నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి సెక్షన్‌ 1ఎ తోపాటు సోమవరం పశ్చిమ బ్లాకును సైతం ప్రైవేట్‌రంగానికి అప్పగించేందుకు టెండర్లను కోరడం గమనార్హం. కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్‌ యాక్టు 2015, మైన్స్‌అండ్‌ మినరల్‌ డవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ యాక్టు 1957 ప్రకారం బొగ్గు గనులను ప్రైవేట్‌రంగానికి అప్పగించి బొగ్గు ఉత్పత్తులు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రకటించింది. 

Updated Date - 2021-10-15T06:12:07+05:30 IST