బొగ్గు రాకుంటే.. దసరా తర్వాత కోతలే!

ABN , First Publish Date - 2021-10-13T08:35:04+05:30 IST

దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం మన రాష్ట్రాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికి దసరా ఉత్సవాలు తోడు కావడం..

బొగ్గు రాకుంటే.. దసరా తర్వాత కోతలే!

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనధికార ‘కట్‌’

ఆర్‌టీపీపీలో ఇంకో యూనిట్‌ షట్‌డౌన్‌

బొగ్గు సరఫరాలో జాప్యంతో సగానికిపైగా తగ్గిన థర్మల్‌ ఉత్పత్తి


అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం మన రాష్ట్రాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికి దసరా ఉత్సవాలు తోడు కావడం.. పండగ సెలవుల కారణంగా కార్మికులు లేక.. మహానది కోల్‌ ఫీల్డ్స్‌లో బొగ్గు ఉత్పత్తి/తవ్వకాలు నిలిచిపోవడం మొదలైన కారణాలతో విద్యుత్కేంద్రాలకు బొగ్గు అందడం కష్టసాధ్యంగా మారింది. సరఫరా మెరుగుపడకుంటే.. థర్మల్‌ విద్యుదుత్పత్తి మరింత తగ్గిపోయి.. దసరా తర్వాత అధికారికంగా కరెంటు కోతలు విధించడం తప్పదని ఇంధన శాఖ వర్గాలు అంటున్నాయి. కృష్ణపట్నంలో మరో యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమవడంతో.. కొంతమేర కష్టాలు తీరతాయని అధికారులు భావించారు. కానీ ముద్దనూరు రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ)లో మరో యూనిట్‌ను మంగళవారం షట్‌డౌన్‌ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆర్‌టీపీపీలో ఇప్పటికే 3యూనిట్లలో ఉత్పత్తి ఆగిపోయింది.


తాజాగా ఉన్న నిల్వలు 65 వేల టన్నులే. కోల్‌ మైన్స్‌ నుంచి రోజువారీ సరఫరా 8-12 వేల టన్నులకు మించడం లేదు. దీంతో రన్‌ అవుతున్న మూడు యూనిట్లలో ఒకదాన్ని మంగళవారం షట్‌డౌన్‌ చేసినట్లు తెలిసింది. విజయవాడ ఎన్‌టీటీపీఎ్‌సలో ఉత్పత్తి సాగుతోంది. మొత్తం గా ఆయా విద్యుత్కేంద్రాల్లో 5,010 మెగావాట్లకు గాను 2,224 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. జల విద్యుత్‌ 1,728 మెగావాట్లకు గాను 1,122 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మంగళవారం 196 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంది. ఉదయం పూట ఎలాగోలా సర్దుబాటు చేస్తున్నా.. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ అధిక వినియోగం కారణంగా డిమాండ్‌ను తట్టుకోవడం ట్రాన్స్‌కోకు కష్టమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు.


రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వల విషయంలో పెద్దగా తేడా కనిపించలేదు. మంగళవారం ఎన్‌టీటీపీఎ్‌సలో 26,895 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఆర్‌టీపీపీలో మూడు యూనిట్లు నడవడం లేదు. ఇక్కడ 69,741 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. కృష్ణపట్నంలో 48,556 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అంటే ప్రతి థర్మల్‌ విద్యుత్కేంద్రంలోనూ 48 గంటలకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. రోజూ నిరంతరాయంగా బొగ్గు ర్యాకులు వస్తే తప్ప ఉత్పత్తి మెరుగయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు 70 శాతం మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి, 30 శాతం సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. దసరా సందర్భంగా మహానది కోల్‌ ఫీల్డ్స్‌లో కార్మికులు బొగ్గు తవ్వకాలు చేయడం లేదు. ఇపారాదీప్‌ పోర్టు నుంచి కృష్ణపట్నంకు ఓడల్లో బొగ్గును చేరవేయాలన్నా.. పెరిగినధరలు ఏపీ జెన్కోను బెంబేలెత్తిస్తున్నాయి. ఏమైనా దసరా తర్వాత విద్యుత్‌ డిమాండ్‌ పెరిగితే.. కోతలు తప్పవని ఇంధనశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2021-10-13T08:35:04+05:30 IST