తీరనున్న రెమ్‌డెసివిర్‌ కొరత

ABN , First Publish Date - 2021-05-05T08:13:52+05:30 IST

ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్న కొవిడ్‌ రోగుల ప్రాణాలను కాపాడుతున్న రెమ్‌డెసివిర్‌ కొరతకు చెక్‌ పడనుంది.

తీరనున్న రెమ్‌డెసివిర్‌ కొరత

  • హెటెరో ఫార్మా మూడో యూనిట్‌కు అనుమతి
  • అక్కడ రోజుకు 15 వేల యూనిట్ల ఉత్పత్తి
  • ఎంఎస్‌ఎన్‌ ఫార్మాకూ..
  • 15 రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి 


హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్న కొవిడ్‌ రోగుల ప్రాణాలను కాపాడుతున్న రెమ్‌డెసివిర్‌ కొరతకు చెక్‌ పడనుంది. తెలంగాణలో నమోదయ్యే కేసులకు, కేంద్రం పంపుతున్న రెమ్‌డెసివిర్‌ కోటాకు సంబంధం లేకపోతుండడంతో.. రాష్ట్రప్రభుత్వం సొంతంగా ఆ ఔషధాన్ని సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో ఆ ఔషధాన్ని తయా రు చేసే రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలకు అదనపు ఉత్పత్తికి అవసరమైన లైసెన్స్‌లను రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ మంజూరు చేసింది.  గిరాకీకి తగినంతగా సరఫరా లేక.. కేంద్రం మన అవసరాలకు తగినన్ని వయల్స్‌ను పంపకపోవడంతో ఈ ఔషధాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో భారీ ధరకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. రెమ్‌డెసివిర్‌ను రాష్ట్రంలో ప్రస్తుతం మైలాన్‌ సంస్థ (రోజుకు 37,000 వయల్స్‌),  హెటెరో ఫార్మా (50,000 వయల్స్‌) తయారు చేస్తున్నాయి. హెటెరో కంపెనీకి కొద్దిరోజుల క్రితం వరకూ రోజుకు 35వేల వయల్స్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉండేది. కొరత కారణంగా ఔషధ నియంత్రణ అధికారులు మరో 15 వేల వయల్స్‌ ఉత్పత్తి చేసే యూనిట్‌కు అనుమతినిచ్చారు. దాంతో రోజుకు 50 వేలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనికి అదనంగా తాజాగా మూడో యూనిట్‌కు లైసెన్స్‌ మంజూరు చేశారు. ఈ కొత్త యూనిట్‌లో రోజుకు సుమారు 15 వేల వయ ల్స్‌ ఉత్పత్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎంఎ్‌సఎన్‌ ఫార్మా కంపెనీకి కూడా తాజాగా రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి అవసరమైన లైసెన్స్‌ మంజూ రు చేశారు. ఈ యూనిట్‌లో రోజుకు 25-30 వేల వయల్స్‌ ఉత్పత్తి అవుతాయని అధికారులంటున్నారు. 

 

మరో 15 రోజుల్లో..

రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి అయిన రోజు నుంచి 15 రోజుల పాటు ప్రత్యేకంగా నిల్వ ఉంచుతారు. 16వ రోజు నుంచి వాటిని వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంజూరు చేసిన లైసెన్స్‌లతో మరో 15-20 రోజుల్లో కొత్త యూనిట్ల నుంచి రెమ్‌డెసివిర్‌ అందుబాటులోకి రానుంది. అయితే మైలాన్‌ కంపెనీ మా త్రం రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా సింగిల్‌ డోసు రెమ్‌డెసివిర్‌ కూడా ఇవ్వడం లేదు. హెటెరో ఫార్మా మాత్రం కేంద్రం వాటాను పంపుతూనే.. రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ 7 వేల వయల్స్‌ను ఇస్తోంది. అలాగే కొత్తగా అనుమతినిచ్చిన యూనిట్ల నుంచి మరో 10వేల వయల్స్‌ వరకు రాష్ట్రప్రభుత్వానికి నేరుగా సమకూరే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-05T08:13:52+05:30 IST