సరిహద్దుల్లో ‘బరి’ తెగించారు

ABN , First Publish Date - 2022-01-12T05:12:00+05:30 IST

తెలంగాణ సరిహద్దును ఆసరాగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం మండల సరిహద్దు పైడిగూడేనికి కేవలం వంద మీటర్ల దూరంలో కోడిపందాలతోపాటు, పేకాట, గుండాట జూదాలు విచ్చలవిడిగా సాగుతన్నాయి.

సరిహద్దుల్లో ‘బరి’ తెగించారు
ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బరి

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతాల్లో బరి ఏర్పాటు

సహకరిస్తున్న అక్కడి పోలీస్‌ అధికారులు

చేతులు మారుతున్న రూ. లక్షలు

బలౌతున్న ఆదివాసీ కుటుంబాలు

దుమ్ముగూడెం జనవరి 11: తెలంగాణ సరిహద్దును ఆసరాగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం మండల సరిహద్దు పైడిగూడేనికి కేవలం వంద మీటర్ల దూరంలో కోడిపందాలతోపాటు, పేకాట, గుండాట జూదాలు విచ్చలవిడిగా సాగుతన్నాయి. సుమారు అరెకరం విస్తీర్ణంలోని అటవీప్రాంతంలో ఇనుప ఫెన్సింగ్‌తో బరి తయారు చేశారు. పైడిగూడెం సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు అతి సమీపంలో గొల్లపల్లి వెళ్లే రహదారి పక్కన అటవీప్రాంతంలో కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. వారానికి అవసరాన్ని బట్టి మూడురోజులు పందేలు సాగు తున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలపై వందలాది మంది పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జూదరులు దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి, చిననల్లబల్లి వైపు నుంచి ఛత్తీస్‌గఢ్‌ వాసులు కిష్టారం వైపునుంచి పందాల బరికి చేరుకుంటున్నారు. ఇరువైపులా కాసిన పందెం సొమ్ము నుంచి పదిశాతం కమీషన్‌ను బరి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పందాలు నిర్వహిస్తుండగా, రూ.20 నుంచి రూ.30లక్షల వరకు చేతులు మారుతున్నాయి. వారంలో రెండు రోజులు పందాలు నిర్వహిస్తుండగా, అవసరాన్ని బట్టి మూడు రోజులు కూడా ఆడిస్తున్నారు. పందెం రూ.20వేల నుంచి మొదలవుతుండగా, జోడీ పందేల పేరిట ఒక్కో పందానికి రూ.లక్షల్లో జూదం నడుస్తోంది. గొల్లపల్లికి చెందిన ఒక మాజీ సర్పంచ్‌ మద్దతుతో భద్రాచలానికి చెందిన వ్యక్తులు బరిని నిర్వహిస్తున్నారు. వారానికి మూడు రోజుల పాటు గురువారం, శుక్రవారం, ఆదివారం పందేలు నిర్వహిస్తుండగా, వందలాది ద్విచక్రవాహనా లు, కార్లపై జూదరులు పాల్గొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తి, వరి పంటల ద్వారా ఆదివాసీ రైతులు సంపాదించిన సొమ్ముల్ని జూదంలో పోగొట్టుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కుమ్మక్కై జూదం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే డబ్బులు ఎక్కువగా నష్టపోతున్నారు. జూదరుల వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని మండల సరిహద్దుల్లో కోడిపందాలు, పేకాట, జూదం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను బాధిత కుటుం బాలు వేడుకుంటున్నాయి. 


Updated Date - 2022-01-12T05:12:00+05:30 IST