కోడూరులో కోకో కాయలు..!

ABN , First Publish Date - 2022-01-20T05:23:27+05:30 IST

రాష్ట్రంలో 43 వేల హెక్టార్లలో కోకో పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 26,216 హెక్టార్లలో ఏడాదికి 18,351 టన్నుల దిగుబడి వస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా అక్కడి రైతులు కోకో చెట్లను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇండోనేషియా, నేపాల్‌ తర్వాత మన రాష్ట్రంలోనే ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. కోకో గింజలను నాణ్యమైన చాక్లెట్లు, కేకుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

కోడూరులో కోకో కాయలు..!
అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానంలో పెరుగుతున్న కోకో చెట్లు

కొబ్బరి తోటలో అంతర పంటగా సాగు

ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు

సక్సెస్‌ అయితే రైతులకు మరో పంట

చాక్లెట్లు, బేకరి పదార్థాల్లో కోకో గింజల వినియోగం


జిల్లాలోని అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కోకో చెట్లు నాటారు. అవి కాపునిచ్చాయి. వీటిపై శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇది సక్సెస్‌ అయితే రైతులకు మామిడి, అరటి, బొప్పాయి తర్వాత కోకో సాగు చేసుకునే వీలు కలుగుతుంది. 

వివరాల్లోకి వెళితే... 


రైల్వేకోడూరు, జనవరి 19: రాష్ట్రంలో 43 వేల హెక్టార్లలో కోకో పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 26,216 హెక్టార్లలో ఏడాదికి 18,351 టన్నుల దిగుబడి వస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా అక్కడి రైతులు కోకో చెట్లను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇండోనేషియా, నేపాల్‌ తర్వాత మన రాష్ట్రంలోనే ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. కోకో గింజలను నాణ్యమైన చాక్లెట్లు, కేకుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. ఎగుమతి పంటగా గుర్తింపు పొందింది.

సాగు ఇలా.. 

కోకో పంట సాగుకు తేమతో కూడిన ఉష్ణమండల ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. ఒక వరుస పద్ధతి గాని రెండు వరుస పద్ధతుల్లో కొబ్బరి తోటలో అంతరపంటగా హెక్టారుకు 500 నాటుకోవచ్చు. కోకో పంట మూడు సంవత్సరాలకు దిగుబడి వస్తుంది. పిందె దశ నుంచి కాయలు కోతకు రావడానికి 5 నెలల సమయం పడుతుంది. ప్రతి కాయలోను 25 నుంచి 40 విత్తనాలు ఉంటాయి. 5 ఏళ్లు పైబడిన తోటల నుంచి స్థిరమైన దిగుబడులు పొందవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడు ఒక్క కోకో మొక్క నుంచి ఏడాదికి 1-2 కిలోల గింజలు పొందవచ్చు. 

అనంతరాజుపేటలో..

ప్రస్తుతం రైల్వేకోడూరు అనంతరాజుపేట ఉద్యాన కళాశాల, ఉద్యాన పరిశోధనా స్థానంలో కోకో పంటను కొబ్బరి తోటలో అంతర పంటగా వేశారు. 2017లో మొక్కలను ప్రయోగాత్మకంగా నాటారు. ఉద్యాన కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు వీటిని సాగు చేస్తున్నారు. అనంతరాజుపేట ఉద్యాన కాలేజి ప్రొఫెసర్‌ హెడ్‌ కేఎం యువరాజ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ తనూజ శివరాం, టీచింగ్‌ అసోసియేట్‌  చంద్రమోహన్‌రెడ్డిల పర్యవేక్షణలో కోకో చోట్ల పెంపకం, పరిశోధనలు సాగుతున్నాయి. పరిశోధనల్లో మంచి ఫలితాలు రావాలని రైల్వేకోడూరు నియోజకవర్గంలో పంట సాగు కావాలని ఇక్కడి రైతులు కోరుకుంటున్నారు.


పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాం

పరిశోధనలు ముమ్మరంగా చేస్తున్నాం. పారెస్టెలో రకానికి చెందిన కోకో మొక్కలను ఏలూరు వారి క్యాట్‌బెర్రీ సంస్థను సంప్రదించి నాటాము. కాయలు సాధారణ పరిమాణంలో పెద్దవిగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఒక్కొక్క కాయలో 30 కన్నా ఎక్కువగా విత్తనాలు ఉన్నాయి. మరో 4 సంవత్సరాల పాటు పరిశోధనలు జరుపుతాం. దిగుబడి, గింజల నాణ్యత పరిగణనలోకి తీసుకుంటాము. తర్వాత రైతులకు వివరిస్తాము. కిలో గింజలు రూ.180కి తీసుకుంటున్నారు. కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తే రైతులకు అదనంగా ఎకరాకు రూ.50 వేలు ఆదాయం వస్తుంది. ఈ గింజల పరిశ్రమను క్యాడ్‌బెర్రీ వారు శ్రీసిటీలో మొండల్స్‌ ఇండియా అనే పేరుతో స్థాపించారు.               

- కేఎం యువరాజ్‌, అనంతరాజుపేట ఉద్యాన కాలేజి ప్రొఫెసర్‌ హెడ్‌ 




Updated Date - 2022-01-20T05:23:27+05:30 IST