కొబ్బరిచెట్టుకు కష్టకాలం

ABN , First Publish Date - 2021-07-31T06:53:55+05:30 IST

సముద్రతీర ప్రాంతాలతోపాటు ఆక్వా సేద్యం విస్తారంగా ఉంటున్న భూముల్లో కొబ్బరి పంటకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కొబ్బరిచెట్టుకు కష్టకాలం
అంతర్వేదికర గ్రామంలో తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లు

  •  కోనసీమ తీర ప్రాంతంలో కొబ్బరి పంటకు ప్రమాద ఘంటికలు
  • ఉప్పునీరు, ఆక్వా కాలుష్యంతో భారీగా చనిపోతున్న చెట్లు
  • అంతర్వేది పరిసరాల్లో రెండు వేల ఎకరాల్లో చెట్లు నాశనం
  • ఉప్పునీటి సాంద్రత వల్లే ఇలా..: అంబాజీపేట శాస్త్రవేత్త

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సముద్రతీర ప్రాంతాలతోపాటు ఆక్వా సేద్యం విస్తారంగా ఉంటున్న భూముల్లో కొబ్బరి పంటకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆక్వా సేద్యం వల్ల చెరువుల గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లు తలలు వాల్చేస్తున్నాయి. తీర ప్రాంత భూముల్లోకి ఉప్పునీరు చొచ్చుకురావడం వల్ల చెట్లు చచ్చుపడిపోతున్నాయి. వేల ఎకరాల భూముల్లో ఈ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఉప్పునీటితో చౌడుబారిన భూముల్లో కొబ్బరి చెట్లు బతికి బయటపడడంలేదు. కోనసీమలోని సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు చచ్చుబడిపోతున్న పరిస్థితులు చూపరులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. గత కొంతకాలం నుంచి తీరం వెంబడి ఉన్న గ్రామా ల్లో ఆక్వా సేద్యం విస్తారంగా వ్యాపిస్తుండడంతో కొబ్బరి పంట కనుమరుగవుతోంది. ఎక్కడికక్కడే చెట్లు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల తెగుళ్లు వ్యాపించి కాయలు కూడా కాయని పరిస్థితి. ముఖ్యంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంత భూముల్లో వేల ఎకరాల పంట పాడైపోయింది. ఇంకా మలికిపురం, రాజోలు, మా మిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం వంటి తీరప్రాంత గ్రామాల్లో ఆక్వా సేద్యం కారణంగా వేల ఎకరాల భూముల్లో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు ఎన్నిరకాల చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. ఇటీవల తీరప్రాంతంలో ఆక్వా సేద్యం పెరగ డంతో సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకురావడంతో ఆ ప్రాంతంలోని భూము లన్నీ ఉప్పుగా మారడంతో చెట్లు చనిపోతున్నాయని అంబాజీపేట కొబ్బరి వ్యవ సాయ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త బీవీకే భగవాన్‌ చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్వేది పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లకు ఈ తరహా పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటలు పాడైపోతున్నాయని ఆయన పేర్కొ న్నారు. ఉదాహరణకు సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో కొల్లాబ త్తుల రాంబాబుకు చెందిన ఆరు ఎకరాల కొబ్బరితోటలోని కొబ్బరిచెట్లు పనికిరా కుండా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆక్వా చెరువు లకు ఉపయోగించే ఉప్పునీటి బోర్ల వల్ల తమ కొబ్బరితోట సర్వనాశనమైందని ఆరోపిస్తున్నారు. అక్రమ ఆక్వాసేద్యం వల్లే కొబ్బరితోటలు పూర్తిగా చనిపోతున్నా యని తీరప్రాంత గ్రామాలకు చెందిన కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆక్వాసేద్యంలో యాంటీబయోటిక్స్‌, కీటకనాశనకారి రసాయనాలు యథేచ్ఛగా ఉపయోగించడం ద్వారా భూగర్భ నీరు కలుషితమై కొబ్బరి పంట పాడవుతోందని ఆ ప్రాంత భూముల పరిశీలనకు వెళ్లిన రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి సభ్యులు ముత్యాల శ్రీనివాస్‌, చింతా సత్య, జాన్‌మోషే, చవ్వాకుల వెంకటేశ్వరరావు తదితరులు బృందం ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణం అక్రమ ఆక్వాసేద్యాన్ని నిరోధిస్తే తప్ప ఫలితం ఉండదని వారు పేర్కొంటున్నారు.

రెండు వేల ఎకరాల్లో పంట నష్టం : భగవాన్‌

అంబాజీపేటలోని వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి బీవీకే భగవాన్‌ ఈ విషయంపై వివ రణ ఇచ్చారు. సముద్రం ఆటుపోటుల కారణంగా తోట ల్లో నీరు నిల్వ ఉండి మొక్కలు, చెట్లు చనిపోతున్నా యని, ఉప్పునీరు నాలుగు రోజులపాటు నిల్వ ఉంటే కొబ్బరి వేర్ల వ్యవస్థ కుళ్లిపోయి చెట్టు దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఉప్పునీరు కొబ్బరి తోటల్లోకి రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా సూచించారు. అంతర్వేది పరిసర ప్రాంతాల్లోని మట్టి నమూనాలు, నీటిని సేకరించి పరిశీలన కోసం పరీక్షా కేంద్రానికి పంపించడం జరిగిందని, అంతర్వేది పరిసరాల్లో రెండు వేల ఎకరాల్లో ఈ పరిస్థితి ఉన్నట్టు వివరించారు.

Updated Date - 2021-07-31T06:53:55+05:30 IST