పక్క జిల్లాల్లోనూ కోడ్‌!

ABN , First Publish Date - 2021-10-22T07:54:27+05:30 IST

ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పొరుగు జిల్లాల్లో కూడా కోడ్‌ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పక్క జిల్లాల్లోనూ కోడ్‌!

  • హుజూరాబాద్‌ సమీపంలో రాజకీయ ప్రలోభాలకు బ్రేక్‌.. భారీ సభలు, సమావేశాలు బంద్‌
  • ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పొరుగు జిల్లాల్లోనూ కోడ్‌ వర్తిస్తుందన్న ఈసీ 
  • 27న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ రద్దు.. అమిత్‌ షా సభ కూడా


న్యూఢిల్లీ/హైదరాబాద్‌/ఓరుగల్లు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పొరుగు జిల్లాల్లో కూడా కోడ్‌ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం సమీపంలో భారీ సభలు, సమావేశాలకు బ్రేక్‌ పడింది. 2018లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర రాజధాని, మెట్రోపాలిటన్‌ నగరాలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కోడ్‌ ఆయా నియోజకవర్గాల వరకే పరిమితమవుతుందని.. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లా మొత్తానికి కోడ్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు అభ్యర్థులు పొరుగు జిల్లాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. కాబట్టి పొరుగు జిల్లాల్లో, పొరుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ వ్యవహారాలు చేపట్టవద్దని పునరుద్ఘాటించింది. ఎన్నికల కోడ్‌తో పాటు కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చూస్తారని పేర్కొంది. ఈసీ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌


అభినందన సభ రద్దయింది. ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించనున్నారు. అదేరోజు కేసీఆర్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారసభలా కాకుండా కేసీఆర్‌ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా ఈ నెల 27న పెంచికలపేటలో అభినందన పేరిట పెద్దఎత్తున సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతంలో తలపెట్టిన ఈ సభకు టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్‌కు సంబంధించి నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్‌, హనుమకొండ జిల్లాలు పూర్తిస్థాయిలో కోడ్‌ పరిధిలోకే వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. దీంతో సీఎం సభ రద్దయింది. అయితే సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో కేసీఆర్‌ సభ నిర్వహించాలని భావించినప్పటికీ ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో ఆ యోచనను విరమించుకున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభ కూడా రద్దయిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ‘మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని ములంగూరు చౌరస్తా వద్ద సభ నిర్వహించాలని నిర్ణయించాం. ఏర్పాట్లు కూడా ప్రారంభించాం. ఈసీ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నాం’ అని ఆయన వివరించారు.


రాజకీయ ప్రలోభాలకు బ్రేక్‌

హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సమీప గ్రామాలను అడ్డాగా చేసుకుని రాజకీయ పార్టీలు ప్రారంభించిన ప్రలోభాలకు ఈసీ నిర్ణయంతో బ్రేక్‌ పడింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌లో తొలుత హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే కోడ్‌ వర్తిస్తుందని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు హుజూరాబాద్‌ నియోజకవర్గం సరిహద్దు గ్రామాలను అడ్డాగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పలు సంఘటనల ఆధారంగా అందిన ఫిర్యాదులు, రాష్ట్రం నుంచి తీసుకున్న నివేదికల ఆధారంగా ఆ రెండు జిల్లాల్లోనూ కోడ్‌ అమలులో ఉంటుందని ఈసీ మార్గదర్శకాలు జారీచేసింది. ఈసీ నిబంధనల ప్రకారం నియోజకవర్గం పరిధిలో సభలు, సమావేశాలకు జనం పరిమిత సంఖ్యలో హాజరు కావాల్సి ఉంటుంది. 


హాల్‌లో అయితే 200 మంది, బహిరంగ ప్రదేశంలో అయితే వెయ్యి మందిలోపు ఉండాలన్న నిబంధన కారణంగా.. రాజకీయ పార్టీలు సమీప గ్రామాలను అడ్డాగా చేసుకుని వ్యవహారం నడిపిస్తున్నాయి. నియోజకవర్గం బయట అయితే ఎవరి అభ్యంతరం ఉండదన్న ఉద్దేశంతో హుజూరాబాద్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కతుర్తి మండల పరిధిలోని గ్రామాలను అడ్డాగా చేసుకుని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఆయా కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వాహనాలను తరలించి ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వారికి భోజనాలు పెట్టడం, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. 


ఆ 2 జిల్లాల్లో కోడ్‌ అమలు: శశాంక్‌ గోయల్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఈ నిబంధన తక్షణం అమల్లోకి వస్తుందని, ఆ నియోజకవర్గం పరిధిలోని పరిస్థితులు, అధికారిక నివేదికల ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-22T07:54:27+05:30 IST