Abn logo
Apr 14 2021 @ 00:17AM

శిథిలమవుతున్న జగన్నాథపురం బౌద్ధక్షేత్రం

కురిచేడు, ఏప్రిల్‌ 13: జిల్లాకు తలమానికం.. పేరెన్నిక గన్న ప్రాచీనమైన జగన్నాథపురం బౌద్ధ క్షేత్రం శిథిలమయ్యే స్థితికి చేరుతోంది. ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని కోటి రూపాయల వ్యయంతో పునఃనిర్మించారు. అయితే నిర్మాణంలో నాసిరకం ఇటుకలు వాడడంతో ఇటుకల నుంచిమట్టి ఊడిపోతోంది. వందల ఏళ్లనాటి ఇటుకలు బాగా ఉన్నా, పునఃనిర్మాణం జరిగి పట్టుమని పదేళ్లు కూడా పూర్తి కాక ముందే కొత్త ఇటుకలు దెబ్బతింటున్నాయి. దీంతో బౌద్ధ క్షేత్రం శిధిలమయ్యే స్థితికి చేరుతోంది.

క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు జగన్నాథపురం బౌద్ధ క్షేత్ర నిర్మాణం చేసినట్లు పురావస్తు తవ్వకాలలో ఆనవాళ్ళు బయట పడ్డాయి. ఇక్కడ నాలుగు శతాబ్దాల పాటు నిర్మాణాలు జరిగాయి. బౌద్ధ భిక్షువులు కంచి నుంచి కాశీ వెళ్లే దారిలో గుండ్లకమ్మ జీవనది పక్కనే ఉన్న ఎత్తైన శింగరకొండను తమకు అనువుగా ఉంటుందని భావించి అక్కడ బౌద్ధ స్థూపం, ఆరామ క్షేత్రాలు నిర్మించుకున్నారు. మొదటి దశలో అశోకుని పూర్వ కాలం, రెండవ దశలో శాతవాహన కాలం, మూడవ దశలో విష్టుకుండిన రాజులు అభివృద్ధి చేశారు. 200 అడుగులు ఎత్తైన కొండపై నిర్మాణాలు జరిగాయి. ప్రధానంగా కొండమీద నిర్మించిన బౌద్ధ స్థూపం వెడల్పు 120 అడుగులు, ఎత్తు 30 అడుగులు. స్థూపానాకి 4 ద్వారాలు. ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ఉంది. ఇది మిగలిన బౌద్ధ స్థూపాల కంటె భిన్నమైనది. ఇక్కడ బుద్ధుని పూజిస్తున్న ఒక పాలరాతి శిల్పం కూడా బయట పడింది. అందుకనే ఈ క్షేత్రానికి హీనయాన క్షేత్రమనే పేరుకూడా వచ్చింది. 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు సుమారు 800 సంవత్సరాల పాటు ప్రముఖ బౌద్ధ ధార్మిక కేంద్రంగా భాసిల్లింది.  చాలా కాలం వెలుగొందిన క్షేత్రం కాలక్రమేణా శిథిలమయింది.

1965 తవ్వకాలలో వెలుగులోకి..

శిథిలమైన జగన్నాథపురం బౌద్ధ క్షేత్రం 1965వ సంవత్సరములో పరిసర గ్రామాలైన పడమర కాశీపురం, వెల్లంపల్లి గ్రామాల వారు గృహాల కోసం మట్టి తీసుకెళ్లడానికి తవ్వుతుండగా కొన్ని పాలరాతి శిల్పాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా బుద్ధుని ఆనవాళ్ళు కనపడ్డాయి. 1972లో పురావస్తు శాఖవారు శింగరకొండను స్వాధీనం చేసుకుని తవ్వకాలు జరిపారు. విలువైన ఆనవాళ్లు చిక్కాయి. బౌద్ధ స్థూపం, స్థూపం చుట్టూ నిర్మించిన బుద్ధుని జీవిత విశేషాలను చిత్రించిన శిల్పాలు, అశోకచక్రం ఉన్న శిల్పం,  వందల కొలదీ బౌద్ధ భిక్షువుల సమాధులు, వారు విశ్రాంతి తీసుకునే గదులు, ధ్యాన గదులు, వినియోగించిన నీరు కిందకు వెళ్లేందుకు కాలువ నిర్మాణం, కొండపై వారు వినియోగించిన రోలు బయటపడ్డాయి. శిల్పాలన్నీ పాలరాతితో చెక్కినవే కావడం విశేషం. ఈ బౌద్ధ క్షేత్రానికి గుర్తింపు తీసుకొచ్చి పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కొంతమేర కృషి చేసింది. ఏపీ టూరిజం వారి సహకారంతో నిర్మాణాలు జరిపారు. రు.18లక్షలతో మ్యూజియం నిర్మాణం చేశారు. రు.26లక్షలతో పర్యాటకులకు విశ్రాంతి భవనాలు నిర్మించారు. అలాగే రు.కోటి ఖర్చుతో స్థూపం నిర్మాణం, ఆరామ క్షేత్రం నిర్మాణాలు చేపట్టారు. 

నాసిరకంగా  మరమ్మతులు 

క్షేత్రం పునఃనిర్మాణం నాసిరకంగా జరిగింది. అప్పటి పెద్ద ఇటుకలను పోలిన ఇటుకలను నూతనంగా తయారు చేయించారు. వాటిని బట్టీలతో కాల్చి బౌద్ధ క్షేత్రంను పునఃనిర్మించారు. అయితే ఈ ఇటుకల్లో నాణ్యత లేకపోవడంతో డొల్లతనం బయపడుతోంది. బౌద్ధ క్షేత్రం గోడలకు వినియోగించిన ఇటుకలు ఊడిపోతున్నాయి. అలాగే వదిలేస్తే బౌద్ధ క్షేత్రం కిందిభాగం దెబ్బతిని పైభాగం కుంగిపోయే అవకాశం ఉంది. పురావస్తు శాఖాధికారులు బౌద్ధ క్షేత్రం రక్షణపై దృషిసారించాలని స్థానికులు కోరుతున్నారు. బౌద్ధ క్షేత్రం వద్దకు వెళ్లడానికి అనువుగా నాటి బౌద్ధ భిక్షువులు ఇటుకలతో మెట్లు నిర్మాంచారు. నేటికి ఆ మెట్లు, ఇటుకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. పునఃనిర్మాణానికి వినియోగించిన  ఇటుకల నుంచిమట్టి రాలుతుండడంతో వాటిని చూసి సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ పేరుగాంచిన బౌద్ధ క్షేత్రాన్ని ఇలానే ఉంచుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడైన ఇటుకల స్థానంలో నూతన ఇటుకలు ఏర్పాటు చేసి రోడ్డు వేసి రాకపోకలకు అనువుగా చేయాలని సందర్శకులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement