అమ్మో జలుబు, దగ్గు

ABN , First Publish Date - 2022-01-25T16:05:02+05:30 IST

ఒకవైపు కరోనా భయం.. మరోవైపు మలేరియా, టైఫాయిడ్‌ వణుకు.. ఇంకోవైపు డెంగ్యూయేమోనని జంకు.. వెరసి రాష్ట్ర మొత్తం వణికిపోతోంది. ముక్కుదిబ్బడ, జలుబు, దగ్గు, ఇవేవీ లేదంటే ఒళ్లు నొప్పులు.. అద

అమ్మో జలుబు, దగ్గు

- అల్లాడిపోతున్న రాష్ట్రం

- పరీక్షల కోసం బారులు తీరుతున్న జనం


చెన్నై: ఒకవైపు కరోనా భయం.. మరోవైపు మలేరియా, టైఫాయిడ్‌ వణుకు.. ఇంకోవైపు డెంగ్యూయేమోనని జంకు.. వెరసి రాష్ట్ర మొత్తం వణికిపోతోంది. ముక్కుదిబ్బడ, జలుబు, దగ్గు, ఇవేవీ లేదంటే ఒళ్లు నొప్పులు.. అదనంగా కావాలంటే జ్వరం వచ్చినట్లుగా భావన... ఈ చిక్కులతో, వంటి సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ లక్షణాలన్నీ చూసుకుని కరోనాయే మోనని భయం, అదనంగా వణుకు వస్తుంటే టైఫాయిడేమోనని అనుమానం. కరోనా పరీక్ష చేయించుకుందామంటే.. కార్పొరేషన్‌ వారు ఇంటి బయట ‘పాజిటివ్‌ బోర్డు’ పెడతారేమోనని భయం. ఆ బోర్డుతో తమకు ఒనగూరేదేమీ లేకపోయినా, 15 రోజులు ప్రపం చానికి దూరంగా ఉండాల్సివస్తుందేమో... దీంతో పరీక్ష చేయించుకుంటే ఎలాంటి ఫలితమొస్తదో, చేయించుకోకుంటే ఏం వస్తదోనన్న భయంతో జనం బయటకు చెప్పుకోలేక, అలాగని మిన్నకుండిపోలేక.. ఏం చేయాలో అర్థంగాక.. సతమతమైపోతున్నారు. అయినా కొంతమంది తెగించి పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళుండడంతో అక్కడ బాధితుల క్యూలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరికి ఇలాంటి లక్షణాలుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చడం, లక్షణాలు కూడా జలుబు, దగ్గు కావడంతో భయాందోళనలు చెందిన ప్రజలు పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ముందు బారులు తీరుతున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు లక్షకు పైగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఫలితాలు వచ్చేందుకు మూడు రోజులకు పైగా పడుతోంది. దీంతో, తమకు సాధారణ దగ్గా? లేక కరోనా లక్షణాలా అని తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఫలితం ఏమొస్తుందోనన్న భయంతో పరీక్ష చేయించుకోకుండా ఉండే వారు పరోక్షంగా వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతుండగా, పరీక్షా ఫలితాల ఆలస్యం కారణంగా ఇంకొంతమంది యధేచ్ఛగా బహిరంగ ప్రాంతాల్లో తిరుగుతూ వైరస్‌ విజృంభణకు కారణమవుతున్నారు. 


Updated Date - 2022-01-25T16:05:02+05:30 IST