Abn logo
May 28 2020 @ 04:06AM

ఘాటెక్కుతున్న ‘కోల్డ్‌’వార్‌..!

శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసిన మిర్చికి బూజు

ఏసీ నిర్వహణ లోపమంటున్న బాధితులు

తేమశాతం ఉండటం వల్లే అంటున్న నిర్వాహకులు 

తప్పెవరిదో తేల్చేందుకు అధికారుల తనిఖీలు

నిర్వాహకులతో సమావేశమైన కలెక్టర్‌


ఖమ్మం, మే 27 (ఆంధ్రజ్యోతి) : కోల్డ్‌స్టోరేజీల్లో కోల్డ్‌ స్టోరేజీలో రైతులు నిల్వ చేసిన మిర్చికి బూజు పడుతున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో కోల్డ్‌స్టోరేజీల నిర్వాహాకులదే తప్పని రైతులు.. కాదు నిల్వచేసే సమయంలో సరైన ప్రమాణాలు పాటించకుండా రైతులే ఇష్టారీతిన బస్తాల్లో మిర్చిని తొక్కడం వల్లే ఇదంతా జరుగుతోందని కోల్డ్‌స్టోరేజీల నిర్వాహకులు వాగ్వివాదానికి దిగుతుండటంతో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కోల్డ్‌‘వార్‌’ ఘాటెక్కుతోంది. ఏసీలో ఉంచి పంటకు బూజు వస్తున్న సంఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. తప్పెవరిదో తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్‌స్టోరేజీల్లో తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందించారు. 


లాక్‌డౌన్‌తో నిండిన శీతలగిడ్డంగులు..

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 37కోల్డ్‌స్టోరేజీలు ఉండగా ఒక్కో దాంట్లో లక్షకు పైగా బస్తాలు నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. ఈ ఏడాది జిల్లాలో 50వేల ఎకరాల్లో మిర్చి సాగవగా.. ఆ మిర్చి చేతికొచ్చే సమయానికి కరోనా లాక్‌డౌన్‌ రావడంతో మార్కెట్‌లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో రైతులంతా కోల్డ్‌స్టోరేజీలను ఆశ్రయించడంతో దాదాపు అన్నీ నిండిపోయాయి. ఆ తర్వాత రెండునెలల అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో రైతులు తాము నిల్వచేసిన పంట ఎలా ఉందోనని చూసుకునేందుకు కోల్డ్‌స్టోరేజీలకు వస్తున్నారు. వారు బస్తాలను పరిశీలించగా కొందరి బస్తాల్లో బూజు పట్టడాన్ని గమనించి కోల్డ్‌స్టోరేజీల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగడం, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పడం లాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. 


వాస్తవ పరిస్థితులేంటి?

బాగా ఆరిన, పొడిగా ఉన్న మిర్చిని శుభ్రంగా, పొడిగా ఉన్న గోనెసంచుల్లో నింపి తేమ నుంచి రక్షణ కల్పించేలా నిల్వచేసినప్పుడే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. అలా గిట్టుబాటు ధర లభించేవరకు తమ పంటను ఏసీల్లో నిల్వ చేసుకుంటున్నారు రైతులు. అయితే ప్రస్తుతం బూజు రావడానికి కారణాలేంటీ అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మిర్చిని నిల్వ చేయడానికి రైతులు కోల్డ్‌స్టోరేజీలకు వచ్చిన సమయంలో తేమశాతాన్ని నమోదు చేయాల్సి ఉండగా పలు కోల్డ్‌స్టోరేజీల్లో అది జరగడంలేదని తెలుస్తోంది. దానికి తోడు మరికొన్ని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చి పాడవకుండా సుమారు 6డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏసీని నడిపించాల్సి ఉంటుంది.


అందుకుగాను ఒక టెక్నికల్‌ ఇంజనీర్‌ను నియమించి పర్యవేక్షించాలి. కానీ కొన్ని చోట్ల మామూలు వ్యక్తులతోనే వాటిని నడిపిస్తున్నట్టు, మరికొన్ని ఏసీల్లో బ్లోయర్ల నుంచి నీరుకారుతున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఏసీల నిర్వహణ సరిగ్గా లేకపోతే కేవలం రంగుమారే అవకాశం మాత్రమే ఉందని, తేమ శాతం ఎక్కువ ఉన్నా, మిర్చిని బస్తాల్లో నింపేముందు మెత్త వేసే సమయంలో ఎక్కువ నీరు చల్లినా బూజు పట్టే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. దాంతో పాటుగా ఏసీ సరిగ్గా పనిచేయకపోతే మొత్తం సరుకు పాడవుతుంది. కానీ ప్రస్తుతం లాట్లలోని కొన్ని బస్తాల్లో మాత్రమే బూజు రావడం లాంటి విషయాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా కోల్ట్‌స్టోరేజీల్లో నిర్వాహకులకు సంబంధించినవే సుమారు 30వేల బస్తాల నిల్వలు ఉన్నట్టు తెలిసింది. 


బూజు పట్టిన దాంట్లో ట్రేడర్స్‌ది ఉందా?

లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో అప్పటివరకు పెరుగుతూ వచ్చిన ధర తగ్గుముఖం పట్టింది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. ఆ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న భావనతో తేమ ఉన్నదీ లేనిది పట్టించుకోకుండా కొనుగోలు చేసి కోల్డ్‌స్టోరేజీలకు తరలించారు. అలా కోల్డ్‌స్టోరేజీలు నిండిపోయాయంటూ వస్తున్న రైతులను వెనక్కి పంపించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. అయితే నేరుగా ట్రేడర్లు వారిపేరుమీద బుక్‌ చేసుకోకుండా ఏయే రైతుల దగ్గరనుంచి కొనుగోలు చేశారో వారి పేరిటనే స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బూజు పట్టిన వాటిల్లో సగం ట్రేడర్స్‌దే ఉన్నాయన్న విమర్శలూ లేకపోలేదు. వారి సరుకు బూజు పట్టడంతో వారికి సబంధించిన ఒకరిద్దరు రైతులను ముందుపెట్టి కోల్డ్‌స్టోరేజీల నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. 


కోల్డ్‌స్టోరేజీ తనిఖీ.. జిల్లాలోని నిర్వాహకులతో భేటీ

‘కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసినమిర్చి నాణ్యత ఎందుకు దెబ్బతింటోంది? రైతుల పంటను కాపాడాల్సిన భాధ్యత మీదే కదా’ అని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఓ కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకులను ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని ఓ కోల్డ్‌ స్టోరేజీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ర్యాకుల్లో వస్తున్న కూలింగ్‌ శాతాన్ని పరిశీలించారు. పంట నిల్వ వివరాలు, కూలింగ్‌ నిర్వహణపై ఆరా తీశారు. కూలింగ్‌ ఉండేలా చేస్తే మిర్చి నాణ్యత ఎందుకు దెబ్బతింటోందని ప్రశ్నించగా.. రైతులు బస్తాలు తెచ్చే సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే సమస్య తలెత్తుతోందని నిర్వాహకులు పేర్కొనగా.. అలా వచ్చే పంటను తనిఖీ చేయకుండా ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లాలోని కోల్డ్‌స్టోరేజీల నిర్వాహకులతో సమావేశమయ్యారు. కోల్డ్‌స్టోరేజీల్లో తలెత్తుతున్న నిల్వ సమస్యపై ఆరా తీసిన ఆయన శీతలగిడ్డంగుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. పంటను సక్రమంగా తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యతను పరిశీలించాకే గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement