TRS లో కోల్డ్‌వార్‌.. ఎమ్మెల్యేలు వర్సెస్ Hyderabad Mayor!

ABN , First Publish Date - 2021-08-08T18:07:19+05:30 IST

TRS లో కోల్డ్‌వార్‌.. ఎమ్మెల్యేలు వర్సెస్ Hyderabad Mayor!

TRS లో కోల్డ్‌వార్‌.. ఎమ్మెల్యేలు వర్సెస్ Hyderabad Mayor!

  • కొందరు ఎమ్మెల్యేలకు మేయర్‌కు నడుమ కొరవడిన సామరస్యత
  • కొన్ని నియోజకవర్గాలకు మేయర్‌ దూరం
  • శుక్రవారం ఎస్‌టీపీల శంకుస్థాపనకు గైర్హాజరు
  • సమాచారమివ్వకుండా తమ ప్రాంతాలకు వస్తున్నారంటున్న ఎమ్మెల్యేలు
  • అధికారులకు మెమోలతో మరింత పెరిగిన దూరం

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో జరిగే పలు కార్యక్రమాలకు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి రావడం లేదు. తాజాగా ఫతేనగర్‌లో జరిగిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎ్‌సటీపీ) శంకుస్థాపనకు ఆమె గైర్హాజరయ్యారు. గతంలోనూ ఒకటి, రెండు కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. ఇందుకు పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్‌ మధ్య నెలకొన్న కోల్డ్‌ వారే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మేయర్‌,  కొందరు ఎమ్మెల్యేల మధ్య వివాదం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


ఫిబ్రవరి 11న గ్రేటర్‌ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. అనంతరం మహానగర ప్రథమ పౌరురాలిగా నగరంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించడం మొదలు పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు, నాలాల విస్తరణ, పూడికతీత పనులు పరిశీలించారు. అదే సయమంలో పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లతో కలిసి రహదారుల నిర్మాణం, బాక్స్‌ డ్రైన్‌లు, ఇతరత్రా పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు చేశారు. కొన్ని  చోట్ల ప్రొటోకాల్‌ ప్రకారం మేయర్‌కు సమాచారమివ్వకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంపై విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర కార్యాలయ అధికారుల ద్వారా జోనల్‌, సర్కిల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా..!

అయినా పరిస్థితి మారకపోవడంతో మంత్రి కేటీఆర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌ పర్వత్‌నగర్‌లో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ ప్రారంభోత్సవం, శేరిలింగంపల్లిలో రోడ్లు, డ్రైనేజీ పనుల శంకుస్థాపన, అంబర్‌పేట, కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గాల్లో పలు పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలను ఫిర్యాదు సందర్భంగా మేయర్‌ ప్రస్తావించినట్టు సమాచారం. మేయర్‌ ఫిర్యాదు నేపథ్యంలో  కొందరు ఎమ్మెల్యేలూ అదేస్థాయిలో స్పందించినట్టు తెలిసింది. నియోజకవర్గాలకు వస్తున్న మేయర్‌ తమకు  సమాచారం ఇవ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు చెప్పినట్టు సమాచారం.


‘ఆంధ్రజ్యోతి’తో ఇలా...

అందరూ కలిసి పోవాలని, ఎవరు ఏం చేసినా.. పరస్ప రం ముందే సమాచారమిచ్చుకోవాలని మంత్రి సూచించినట్టు తెలిసింది. మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేలు, మేయర్‌కు మధ్య కూడా అంత సఖ్యత లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా వచ్చారన్న విషయంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘కొంతకాలంగా కార్యక్రమం ఉంటే ఒక రోజు ముందు సమాచారమిస్తున్నారు. మాకు వీలుంటే పాల్గొంటున్నాం’ అని మేయర్‌ ఫిర్యాదు చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యేలలో ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


అందుకే వివాదం..

తాజాగా, ఫతేనగర్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి మేయర్‌ హాజరు కాలేదు. ఒంట్లో నలతగా ఉండడంతో కార్యక్రమానికి వెళ్లలేదని మేయర్‌ కార్యాలయ వర్గాలు చెబుతున్నా, శనివారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో డ్రైనేజీలో పడి మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం పంపిణీకి ఆమె హాజరయ్యారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం నివాసంలోనే నివాళులర్పించారు. కార్యాలయానికి వచ్చిన పలువురిని కలిసినట్లుగా తెలిసింది. కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం పలువురు ఇంజనీరింగ్‌ అధికారులకు కమిషనర్‌ మెమోలు ఇవ్వడమూ ఎమ్మెల్యేలు, మేయర్‌ మధ్య దూరం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కొందరు అధికారులను ఎమ్మెల్యేలు పట్టుబట్టి మరీ తమ నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటారు. అలాంటి వారికి  మెమోలు రావడాన్ని ఇబ్బందిగా భావించిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.

Updated Date - 2021-08-08T18:07:19+05:30 IST