కుప్పకూలిన అరటి ధరలు

ABN , First Publish Date - 2021-01-18T05:37:47+05:30 IST

అరటి ధరలు కుప్పకూలిపోయాయి. ఇటీవల నెల రోజులుగా భారీ వర్షాలు కురవడం, పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల అరటికాయల నాణ్యత లోపించింది. తోటల్లో కాయలకు నాణ్యత లోపించడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయింది.

కుప్పకూలిన అరటి ధరలు
తోటల్లోనే దెబ్బతిన్న అరటికాయలు

వర్షాల వల్ల నాణ్యత లోపించిన కాయలు 

కిలో రూ.10 అమ్మాల్సి ఉండగా రూ.5కు పడిపోయిన దరలు 

రాజంపేట, జనవరి 17: అరటి ధరలు కుప్పకూలిపోయాయి. ఇటీవల నెల రోజులుగా భారీ వర్షాలు కురవడం, పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల అరటికాయల నాణ్యత లోపించింది. తోటల్లో కాయలకు నాణ్యత లోపించడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుత సీజనలో కిలో పది రూపాయలు అమ్మాల్సి ఉండగా ఐదు రూపాయలకు పడిపోయింది. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో 40 వేల ఎకరాల్లో అరటిపంటను సాగు చేస్తారు. ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో అరటిపంట సాగవుతూ ఉంటుంది. బెంగుళూరు, చెన్నై, నెల్లూరు, గూడూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం 20 లారీలకు తక్కువ లేకుండా ఎగుమతి చేస్తుంటారు. మామూలుగా ఈ ప్రాంతంలో పచ్చ అరటి, అమృతపాణి, రస్తాలు తదితర రకరకాల అరటిపంటను సాగు చేస్తారు. ఎక్కువగా పచ్చ అరటి పంటను సాగు చేస్తారు. పచ్చఅరటి పంటను ఏడాది పొడవునా సాగు చేస్తూ ఉంటారు. బాగా పండితే ఓ అరటిగెల 25 కిలోల నుంచి 30 కిలోల బరువు ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాల వల్ల నీరు తోటల్లో నిల్వ ఉండటంతో వివిధ రకాల తెగుళ్లు సోకడం, ప్రతిరోజూ మంచు పడటం వల్ల కాయలలో నాణ్యత తగ్గింది. కాయల సైజు కూడా బాగా తగ్గి ఉండటంతో వీటికి డిమాండ్‌ లేకుండా పోయింది. ప్రస్తుతం అరటి గెల 15 నుంచి 20 కిలోల మధ్యే ఉంది. ఒక్క అరటి గెల 80 రూపాయల లోపే ధర పలుకుతోంది. ఒక ఎకరా సాగుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. బాగా పండితే లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. ఎకరాకు 800 నుంచి 1000 చెట్ల వరకు సాగు చేస్తారు. కరోనా వల్ల గతంలో మార్కెట్‌ లేక అరటికాయలను ఎక్కడికక్కడే వదిలి వేసి భారీ నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడటం వల్ల కాయలలో నాణ్యత తగ్గి డిమాండ్‌ లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి ఖర్చు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. 


అరటి వల్ల అన్ని విధాలా నష్టాలే

- కావుటూరి సుబ్రహ్మణ్యంనాయుడు, అరటి రైతు, రాజంపేట

గతంలో అరటిపంట వల్ల భారీ ఎత్తున లాభాలు వచ్చేవి. నేడు అరటి పంట సాగు చేయాలంటేనే భయమేస్తోంది. సాగు ఖర్చు ఎక్కువ. ఆదాయం తక్కువగా ఉంది. జిల్లాలో ఎక్కువగా రాజంపేట, రైల్వేకోడూరులోనే అరటిపంటను సాగు చేస్తారు. విస్తారంగా పంట పండినా కరోనా వల్ల కాయలను ఎగుమతి చేసుకోలేక పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పుడు నెల పొడవునా వర్షాలు భారీ ఎత్తున కురిసి పొలాల్లోనే నీరు నిల్వ ఉండటం, ప్రతిరోజూ మంచు పడటం వల్ల కాయల నాణ్యత లేకుండా పోయింది. నాణ్యత లేని కాయలను కొనే వారు తక్కువ. కిలో పది రూపాయలు అమ్మాల్సి ఉండగా ఐదు రూపాయలకు కూడా కొనే వారు కరువయ్యారు. నేను 20 ఎకరాల్లో పంటను సాగు చేశాను. అప్పుడు కరవుతో వల్ల, ఇప్పుడు వర్షాలు, కరోనా వల్ల అన్ని రకాలా నష్టపోయాం. 


అరటి పంట వల్ల పెద్ద ఎత్తున నష్టం

- నేలపాటి రామచంద్రనాయుడు, అరటిరైతు, టి.కమ్మపల్లె

అరటిపంటను సాగు చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయాము. పుల్లంపేట మండలం కమ్మపల్లె గ్రామంలో అరటిపంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. నేను 30 ఎకరాల్లో అరటిపంటను సాగు చేయగా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. 30 ఎకరాల సాగుకు 30 లక్షలు ఖర్చు అయ్యింది. గతంలో ఐదేళ్లు వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి నీరు ఇంకిపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు నెల రోజులుగా వర్షాలు కురవడంతో ఉన్న పంటంతా నీటమునిగింది. అందువల్ల కాయల్లో సైజు తగ్గిపోయి డిమాండ్‌ లేకుండా పోయింది. 

Updated Date - 2021-01-18T05:37:47+05:30 IST