మన్యంలో సేకరించి... నగరాలకు తరలించి

ABN , First Publish Date - 2021-10-25T05:42:17+05:30 IST

మన్యంలో సేకరిస్తున్న కొండచీపుర్లకు నగరాల్లో మంచి ఆదరణ లభిస్తోంది.

మన్యంలో సేకరించి... నగరాలకు తరలించి
కొండ చీపుర్లను కడుతున్న గిరిజనులు

  బ్రాండ్‌ పేర్లతో కొండచీపుర్ల విక్రయం

  500 కుటుంబాలకు జీవనాధారం

సీతంపేట: మన్యంలో సేకరిస్తున్న కొండచీపుర్లకు నగరాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడి సేకరించిన మైదానప్రాంత వ్యాపారులు అధిక ధరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక్కడ 500 కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయి. ఇక్కడి చీపుర్లను మైదాన ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని చింతామణి, జిగేల్‌రాణి బ్రాండ్లపేర్లతో విక్రయిస్తున్నారు. వీటి కి ఇతర రాష్ర్టాల్లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఏటా రూ. ఐదు కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్‌, బరంపురం, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు ఇక్కడి చీపుర్లు తరలించి విక్రయిస్తు న్నారు. ఏడాది పొడువునా ఈ చీపుర్లు సీతంపేట ఏజెన్సీలో లభ్యమవుతున్నాయి. నాణ్యతతో కూడిన చీపర్లు కావడంతో మంచి డిమాండ్‌ ఉంది. మొదట్లో చీపురు రూ.25 నుంచి రూ.30 వరకు అమ్మేవారు. అక్టోబరు, నవంబరుల్లో ఇదే చీపురును రూ. 50 నుంచి రూ.60కు విక్రయిస్తున్నారు. చీపుర్లు ద్వారా మంచి ఆదాయం రావడంతో వీటి తయారీకి గిరిజనులు ఆసక్తిచూపుతున్నారు. అయితే పెట్టుబడికి అవసరమైన డబ్బులు లేక వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పుచేయాల్సివస్తోందని వాపోతున్నారు. ఐటీడీఏ ద్వారా కొండచీపుర్ల వ్యాపారానికి ఆర్థికసాయం చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశముంటుందని గిరిజనులు చెబుతున్నారు. ఐటీడీఏ పరిధిలో ఐదువేల ఎకరాల వరకు కొండచీపుర్ల సాగును అంతర పంటగా సాగుచేస్తున్నారు. వెలుగు ద్వారా వన్‌థన్‌ పఽథకం కింద ఆర్థికంగా చేయూతను కల్పించి యూనిట్లను ఏర్పాటుచేస్తే కొం డచీపుర్ల వ్యాపారం విస్తరిస్తుందని గిరిజన మహిళలు చెబుతు న్నారు. గతంలో జీసీసీ ద్వారా కొండచీపుర్లు పెద్దఎత్తున కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం గిరిజనులే నేరుగా కొండచీపుర్లు తయారుచేసి వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కాగా కొండ చీపుర్ల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధంచేస్తామని వెలుగు ఏపీడీ నారాయణరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వన్‌ధన్‌ కింద ఒక సంఘానికి ఆర్థిక సాయం కూడా అందజేశామని చెప్పారు.



Updated Date - 2021-10-25T05:42:17+05:30 IST