ఆన్‌లైన్‌లో అద్దెల వసూలు

ABN , First Publish Date - 2020-08-15T09:07:26+05:30 IST

పారదర్శకంగా, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం లేకుండా వాణిజ్య సముదాయాలు, మార్కెట్ల అద్దెలు వసూలు చేసేందుకు

ఆన్‌లైన్‌లో అద్దెల వసూలు

వాణిజ్య సముదాయాలు, మార్కెట్ల నుంచి..

జీహెచ్‌ఎంసీ సాఫ్ట్‌వేర్‌ సిద్ధం

త్వరలో ట్రయల్‌ రన్‌

నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే జరిమానా

దీర్ఘకాలం చెల్లించని వారిపై చర్యలు

నెలాఖరుకు పూర్తిస్థాయి అమలు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పారదర్శకంగా, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం లేకుండా వాణిజ్య సముదాయాలు, మార్కెట్ల అద్దెలు వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సీజీజీతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. త్వరలో ఒకటి, రెండు వాణిజ్య సముదాయాల్లోని దుకాణదారుల నుంచి అద్దె వసూలుకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన మార్కెట్లలో 2,000, వాణిజ్య సముదాయాల్లో 700 దుకాణాలున్నాయి. వేలం ద్వారా దుకాణాలను నిర్ణీత కాల వ్యవధి వరకు లీజుకిస్తున్నారు. ఎంపికైన వ్యక్తులు, సంస్థలు ప్రతినెలా అద్దె చెల్లించాలి. కానీ, వాస్తవ డిమాండ్‌లో 50 శాతంలోపు మాత్రమే అద్దె వసూలవుతోంది. 


ప్రస్తుతం బిల్‌ కలెక్టర్లు వెళ్లి అద్దె వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఏళ్ల తరబడి అద్దె వసూలు చేయకుండా లీజుదారులకు ప్రయోజనం చేకూర్చేలా కొందరు బిల్‌ కలెక్టర్లు వ్యవహరించారు. చెక్కులు తీసుకోవడం, అనంతరం అవి బౌన్స్‌ అవడంతో అద్దె వసూలు కాలేదు. వేలల్లో ఉన్న అద్దె చెల్లించకుండా బిల్‌ కలెక్టర్లకు ఎంతోకొంత ముట్టచెప్పి, చర్యలు తీసుకోకుండా మెనేజ్‌ చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవంగా బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువకు దుకాణాలను అద్దెకిచ్చారు. గతంలో చాలా వరకు 15, 20, 25 ఏళ్లపాటు లీజుకిచ్చారు.


ఇప్పుడు సుదీర్ఘకాలం కాకుండా, నిర్ణీత శాతం అద్దె పెంచుతూ ఏటా రెన్యూవల్‌ చేసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. 15, 20 ఏళ్ల నుంచి దుకాణాల్లో ఉంటే అద్దె చెల్లించని వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో కొందరు రెన్యూవల్‌ చేసుకోగా, రెన్యూవల్‌ చేయించుకోని వారిపై చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 50 మంది వరకు కోర్టుకు వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయాలేవి పట్టించుకోని ఎస్టేట్‌ విభాగం రెండేళ్లుగా అద్దెల వసూలు, లీజులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. 


మూడు ఆప్షన్లు..

ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వస్తే లీజుదారులకు కేటాయించిన నంబర్‌ ఆధారంగా అద్దె చెల్లించవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌, మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లలో చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా కొందరు దుకాణదారుడితో ఆన్‌లైన్‌లో, ఇంకొందరితో మొబైల్‌ యాప్‌ ద్వారా, మరి కొందరితో సీఎ్‌సలో అద్దె చెల్లింపజేస్తామని ఓ అధికారి తెలిపారు. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయితే  నెలాఖరుకు పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి తీసుకువచ్చి వచ్చే నెల నుంచి ఆన్‌లైన్‌లో అద్దె వసూలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏటా రూ. 5 కోట్ల వరకు వస్తోన్న ఆదాయం పెరిగిన అద్దె, కొత్త మోడల్‌ మార్కెట్ల లీజుతో రూ. 12 నుంచి రూ. 15 కోట్ల వరకు వసూలవుతుందని పేర్కొన్నారు.   


ఆన్‌లైన్‌లో ఇలా..

అద్దెకిస్తోన్న దుకాణాలకు ప్రత్యేక నంబర్లు  కేటాయించి వివరాలు సీజీజీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్త ధరల ప్రకారం అద్దె నిర్ణయించారు. దుకాణదారులు ఒప్పందం ప్రకారం నెలకు ఎంత అద్దె, ఏ తేదీలోపు చెల్లించాలి అన్నవి ఆన్‌లైన్‌లో ఉంటాయి. గడువునకు ముందే ఆస్తిపన్ను తరహాలో ఈ గడువులోపు అద్దె చెల్లించాలనే మెసేజ్‌ లీజుదారుల మొబైల్‌ నంబర్‌కు వెళ్తుంది. ఆ తేదీలోపు చెల్లించకపోతే ప్రతినెలా పెనాల్టీ పెరుగుతూనే ఉంటుంది. నెలకు రెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఓ అధికారి చెప్పారు. ఉదాహరణకు ఈ లీజుదారుడు 5వ తేదీలోపు అద్దె చెల్లించాలి. గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి రెండు శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఇదంతా ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో జరుగుతుందని, అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండదు. సీజీజీ సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో వారం రోజుల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. బుద్ధభవన్‌, హరిహర కళాభవన్‌లలో ఏదైనా ఒక సముదాయంలోని దుకాణదారుల నుంచి ట్రయల్‌ రన్‌లో భాగంగా అద్దె వసూలు చేయనున్నారు. 

Updated Date - 2020-08-15T09:07:26+05:30 IST