సకాలంలో ధాన్యం సేకరించాలి

ABN , First Publish Date - 2021-05-08T08:32:56+05:30 IST

ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని, మొత్తం ప్రక్రియను ప్రభుత్వ

సకాలంలో ధాన్యం సేకరించాలి

మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.. రైతులు కోరిన విత్తనాలు ఇవ్వాలి

వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలి 

కమిటీలను క్రియాశీలంచేయాలి.. ప్రత్యామ్నాయ పంటలపై సలహాలు

ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం జగన్‌


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని, మొత్తం ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగమే చేపట్టాలని స్పష్టం చేశారు. ఏ ఊరి పంట ఏ మిల్లుకు వెళ్తోందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలని, రవాణాలో వ్యయ నియంత్రణ కోసం ఇతర మిల్లులకు ధాన్యాన్ని పంపొద్దని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రబీ ధాన్యం సేకరణ, రేషన్‌ డోర్‌ డెలివరీపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల విషయంలో వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌరసరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు. రైతులకు కోరిన విత్తనాలు ఇవ్వాలని, ఇందుకోసం రెండు శాఖలు రైతు భరోసా కేంద్రాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా చూడాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలం చేయాలన్నారు. 


పంట ప్రణాళిక నుంచి అన్ని విషయాల్లో ఈ కమిటీలు రైతులకు అండగా నిలవాలని సూచించారు. అన్నింటిలోనూ మహిళా రైతుల భాగస్వామ్యం ఉండాలని, ఈ కమిటీల బాధ్యతలు, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారని తెలిపారు. ఏ పంట వేస్తే బాగుంటుంది.. ఏ పంటలకు కొనుగోలుకు ఇబ్బంది ఉండదు.. అనే విషయాలను కమిటీలు ముందే రైతులకు చెప్పాలన్నారు. రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే, ప్రత్యామ్నాయ పంటల గురించి సూచనలు చేయాలన్నారు. కాగా ఈ రబీ సీజన్‌లో 45.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గతేడాది కంటే 12 శాతం ఎక్కువని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తున్నారని తెలిపారు.


నిర్ణీత వ్యవధిలో రేషన్‌ పంపిణీ 

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలో ప్రతి నెలా రేషన్‌ పంపిణీ పూర్తి చేయాలన్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని స్పష్టం చేశారు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ తీసుకోకపోతే, వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయాలన్నారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు పూనం మాలకొండయ్య, కోన శశిధర్‌, సూర్యకుమారి, హెచ్‌.అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T08:32:56+05:30 IST