కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టరు

ABN , First Publish Date - 2021-05-05T06:49:25+05:30 IST

జిల్లాలో కరోనా బాధితులను త్వరగా గుర్తించటంతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యసేవలు సత్వరం అందించేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టరు పోలా భాస్కర్‌ చెప్పారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టరు

 సత్వర వైద్యానికి ఏర్పాట్లు 

జిల్లా కలెక్టరు పోలా భాస్కర్‌ 

కందుకూరు, మే 4 : జిల్లాలో కరోనా బాధితులను త్వరగా గుర్తించటంతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యసేవలు సత్వరం అందించేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టరు పోలా భాస్కర్‌ చెప్పారు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు తోడు ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు కూడా నిర్వహించటం ద్వారా బాధితులను త్వరగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తీవ్రత అధికంగా ఉన్న వారిని తక్షణ ం హాస్పటల్స్‌కి, తీవ్రత తక్కువగా ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తరలించి చికిత్స చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3500 పడకలు అందుబాటులో ఉన్నాయని, కందుకూరులో 125 పడకలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 80 మంది బాధితులు ఉన్నారని తెలిపారు.  

నేటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలు, హాస్పిటల్స్‌లో పెరిగిన బెడ్లు

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అమలులోకి వస్తున్నందున కొవిడ్‌ నియంత్రణ  సాధ్యమవుతుందని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  జిల్లా కలెక్టరు వెంట కందుకూరు సబ్‌ కలెక్టరు ఎ. భార్గవతేజ, తహసీల్దార్‌ డి. సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌, ఇతర అధికారులు ఉన్నారు. 

కందుకూరు చుట్టూ పోలీసు చెక్‌పోస్టులు

కందుకూరు, మే 4 : కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నందున, అత్యవసరం మినహా తిరిగే వాహనాలను సీజ్‌ చేయాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం తహసీల్దార్‌ డి. సీతారామయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వైద్యం, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కరోనా ఊహించని రీతిలో ఈ విడత ప్రాణాలను బలి తీసుకుంటున్నందున కర్ఫ్యూ అమలులో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉన్నందున ఆ సమయంలో షాపుల వద్ద గుంపులు చేరకుండా కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.  మధ్యాహ్నం 12 గంటలకల్లా మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్‌ తప్పకుండా మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మందులు, పాలు లాంటి అత్యవసరాలకు తప్ప ఎవరైనా అనవసరం కనిపిస్తే భారీ జరిమానాలు విధించటంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేయాలని చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాలను పదిహేను రోజుల తర్వాత సంబంధిత వ్యక్తులకు ఇవ్వాలన్నారు. కర్ఫ్యూ అమలులో ఉండే మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు పట్టణంలోకి వాహనాలు రాకుండా నలుమూలల ప్రధాన రహదారులలో 9 చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో సీఐ విజయకుమార్‌, డాక్టరు ఇంద్రాణి, ఎస్‌ఐలు కేకే తిరుపతిరావు, కె.అంకమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T06:49:25+05:30 IST