ఐసీడీఎస్‌లో వసూళ్ల పర్వం!

ABN , First Publish Date - 2021-08-01T05:54:30+05:30 IST

ఐసీడీఎస్‌ వ్యవస్థలో వసూళ్ల పర్వం నడుస్తోందా? సమావేశాల పేరిట అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి నెలవారీ నగదు వసూలు చేస్తున్నారా? కేంద్రాల నిర్వహణ, ఇతరత్రా అలవెన్స్‌ల మంజూరు విషయంలో పర్సంటేజీలు అడుగుతున్నారా?... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ కార్యాలయంలో అక్రమపర్వం దృశ్యాలు వెలుగు చూశాయి.

ఐసీడీఎస్‌లో వసూళ్ల పర్వం!
కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ కార్యాలయం




సూపర్‌వైజర్ల చేతివాటం

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు

(టెక్కలి)

ఐసీడీఎస్‌ వ్యవస్థలో వసూళ్ల పర్వం నడుస్తోందా? సమావేశాల పేరిట అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి నెలవారీ నగదు వసూలు చేస్తున్నారా? కేంద్రాల నిర్వహణ, ఇతరత్రా అలవెన్స్‌ల మంజూరు విషయంలో పర్సంటేజీలు అడుగుతున్నారా?... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ కార్యాలయంలో అక్రమపర్వం దృశ్యాలు వెలుగు చూశాయి. ఇవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పాలు, పౌష్టికాహారం పక్కదారి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీడీఎస్‌...ఈ ఘటనతో విమర్శల పాలవుతోంది. కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో కొందరు సూపర్‌వైజర్లపై ఆరోపణలున్నాయి. కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి మరీ అంగన్‌వాడీ సిబ్బంది నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రాల నిర్వహణకు సంబంధించి అద్దెలు, టీఏ, డీఏతో పాటు ఇతర అలవెన్స్‌ల మంజూరులో పర్సంటేజీలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.  ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సూపర్‌వైజర్లు తనిఖీల పేరిట పర్సంటేజీలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కోటబొమ్మాళి ప్రాజెక్ట్‌ పరిధిలోని తొమ్మిది సెక్టార్లలో ఐదుగురు సూపర్‌వైజర్లు పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో టేక్‌ హోం రేషన్‌ పద్ధతిలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీనిని సాకుగా చూపి ఒక్కో కేంద్రం నుంచి రూ.200 నుంచి రూ.300 వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం. సెక్టారు సమావేశాల్లో సమీక్షల అనంతరం కేంద్రాల వారీగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయంపై ‘ఆంధ్రజ్యోతి’  సంబంధిత  ప్రాజెక్ట్‌ అధికారిణి తులసిలక్ష్మి వద్ద ప్రస్తావించగా వసూలు విషయం తన దృష్టికి రాలేదన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  



Updated Date - 2021-08-01T05:54:30+05:30 IST