ఐటీఐ చదివితే ఇంజనీర్‌! ఇంటర్‌ పాసైతే సీనియర్‌ ఇంజినీర్‌!

ABN , First Publish Date - 2020-07-08T20:47:46+05:30 IST

ఐటీఐ చదివితే ఇంజనీర్‌ ఉద్యోగం...ఇంటర్మీడియట్‌ పాసైతే..

ఐటీఐ చదివితే ఇంజనీర్‌! ఇంటర్‌ పాసైతే సీనియర్‌ ఇంజినీర్‌!

...ఇవీ ఎల్‌జీ పాలిమర్స్‌లో సిబ్బంది అర్హతలు

పైగా 40 ఏళ్ల క్రితం నాటి మొలాసిస్‌ ట్యాంకులో స్టైరిన్‌ నిల్వ

ఒక్క నిబంధనా పాటించలేదు... అన్నీ అక్రమమే

ఆ ట్యాంకును ప్రమాదకరంగా భావించనే లేదు

రెస్క్యూ ఆపరేషన్‌లో చేయి వేయలేదు... జిల్లా అధికారులపై వదిలేసింది

నివేదికలో వెల్లడించిన హైపవర్‌ కమిటీ

16 మంది నుంచి నివేదికలు సేకరణ

280 మందిని సాక్షులుగా చేర్చిన పోలీసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఐటీఐ చదివితే ఇంజనీర్‌ ఉద్యోగం... ఇంటర్మీడియట్‌ పాసైతే సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టు. ఇదీ ఎల్‌జీ పాలిమర్స్‌లో సిబ్బంది నియామకం తీరు. ఇక శిక్షణ గురించి చెప్పాలంటే...అక్కడ పనిచేసే సిబ్బందిలో ఎవరికీ, ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. ప్రాణాలు హరించే విషవాయువును వెదజల్లిన స్టైరిన్‌ ట్యాంకును ఆ యాజమాన్యం ప్రమాదకరమైనదని కూడా గుర్తించలేదు. ఆ విషయం సిబ్బందికీ చెప్పలేదు. సాధారణంగా ఇలాంటి వాటిపై ‘ప్రమాదకరం’ అంటూ రాస్తారు. అటువంటిది అక్కడ అటువంటిదేమీలేదు. అసలు విషయం ఏమిటంటే...అది స్టైరిన్‌ ట్యాంకు కానే కాదు. గతంలో అక్కడ నడిచిన కంపెనీ మొలాసిస్‌ కోసం ఆ ట్యాంకును నిర్మించింది. 1977లో ఎల్‌జీ పాలిమర్స్‌ ఆ కంపెనీని తీసుకుంది.


అప్పటి నుంచి ఆ ట్యాంకు (ఎం.6)ను స్టైరిన్‌ నిల్వ చేయడానికి ఉపయోగిస్తోంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ప్రత్యేకమైన కార్బన్‌ లైనింగ్‌ కలిగిన స్టీల్‌ ట్యాంకును స్టైరిన్‌ నిల్వ చేయడానికి వినియోగించాలి. కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి అందుబాటులో వున్న పాత, గడువు తీరిన మొలాసిస్‌ ట్యాంకును ఉపయోగిస్తోంది. అదే ప్రమాదానికి కారణమైంది. పైగా ప్రమాదం జరిగినప్పుడు పాలిమర్స్‌లో అంతమంది సిబ్బంది వున్నా ఒక్కరు కూడా సహాయక చర్యలు చేపట్టలేదు. ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మొత్తం అంతా జిల్లా యంత్రాంగంపైనే వదిలేశారు. సైరన్‌ పనిచేసే స్థితిలో ఉన్నా...దానిని మోగించలేదు. ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఇవన్నీ తప్పులేనని కమిటీ అభిప్రాయపడింది.


అన్నీ ఉద్దేశపూర్వకంగానే...!

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలన్నీ ఉల్లంఘించిందని, ఎక్కడా ప్రభుత్వ శాఖల సూచనలకు అనుగుణంగా పనిచేయలేదని హై పవర్‌ కమిటీ నివేదించింది. మొత్తం 15 మందిని బలిగొన్న ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అన్ని విషయాలపైనా కూలంకుషంగా పరిశోధించి సమగ్ర నివేదికను సమర్పించింది. 


నివేదికలోని వివరాలివి...

- అర్హతలు కలిగిన వైద్యాధికారి లేరు. మెడికల్‌ ప్రాక్టీసర్‌ను చూపించి, ఆయనే మెడికల్‌ ఆఫీసర్‌ అంటున్నారు. ఆయనకు ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు.

- భద్రత అధికారికి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఆ ప్రాంతంలో వున్నట్టు కంపెనీ రికార్డుల్లో ఎక్కడా చూపించలేదు.

- లాక్‌డౌన్‌ తరువాత కంపెనీని పునఃప్రారంభించాలనుకున్నప్పుడు ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ పాటించాలి. భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి. అవేమీ లేవు.

- కంపెనీ తెరవడానికి ముందు కూడా ప్రీస్టార్టప్‌ నిర్వహించాలి. దానికి సంబంధించిన రికార్డులు లేవు.

- స్టైరిన్‌ ట్యాంకుకు సంబంధించిన రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌లను లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం ఆన్‌ చేసి, సాయంత్రం ఆఫ్‌ చేసినట్టు యాజమాన్యం నివేదించింది. అయితే సైర్టిన్‌ ట్యాంకులో వున్నప్పుడు రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ నిరంతరం ఆన్‌లోనే ఉండాలి. వాటిని ఆపడానికి వీల్లేదు. ఇలాంటి చిన్న విషయాలు కూడా తెలియకుండా అక్కడ సిబ్బంది వ్యవహరిస్తున్నారని కమిటీ విశ్లేషించింది.

- పైపులు తుప్పు పడుతున్నాయని, వాటిని మార్చాలని గతంలో ఫ్యాక్టరీస్‌ అధికారులు హెచ్చరించినా యాజమాన్యం ఖాతరు చేయలేదు. వాటిని మార్చలేదు. 

- ప్రాసెస్‌ సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించలేదు.

- ప్లాంటులో స్టైరిన్‌ ట్యాంకులు రెండు ఉన్నాయి. ఒకవేళ వాటిల్లో ఏదైనా సమస్య వస్తే స్టైరిన్‌ను వేరే ట్యాంకులోనికి పంపడానికి ‘బఫర్‌ ట్యాంకు’ అని ఒకటి ఏర్పాటు చేసి, దానిని వీటితో అనుసంధానిస్తారు. అయితే ఇక్కడ బఫర్‌ ట్యాంకు లేనే లేదు.


భారీగా పోలీసు విచారణ

ఈ ప్రమాదంపై పోలీసు విభాగం భారీస్థాయిలో విచారణ చేసింది. మొత్తం 280 మందిని సాక్షులుగా చూపించింది. ప్లాంటులో పనిచేస్తున్న వివిధ స్థాయిల్లో 16 మంది నుంచి నివేదికలు సేకరించింది. కంపెనీ డైరెక్టర్లు విశాఖపట్నం వదిలిపోకుండా వుండేందుకు వారి పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకుంది. ఐపీసీ 304-1, 278, 284, 285, 337 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసింది.

Updated Date - 2020-07-08T20:47:46+05:30 IST