సమష్టిగా శాంతి సాధన

ABN , First Publish Date - 2020-09-19T06:20:31+05:30 IST

అణ్వాయుధాలు ఉన్నా కరోనా వైరస్ నుంచి మానవాళికి రక్షణ లేదనే నిజం అందరికీ అర్థమైంది.

సమష్టిగా శాంతి సాధన

అణ్వాయుధాలు ఉన్నా కరోనా వైరస్ నుంచి మానవాళికి రక్షణ లేదనే నిజం అందరికీ అర్థమైంది. సకల దేశాలూ తమ రక్షణ వ్యవస్థలపై ఖర్చుని క్రమేణా తగ్గించాలన్న తీర్మానాన్ని ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదించి, ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆ రోజున శాంతి ఆశయాలకు అంకితమవ్వాలని, 24 గంటల పాటు కాల్పుల విరమణ చేయాలని నిర్దేశించింది. ఆ రోజున న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శాంతి గంటను మోగించడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కొవిడ్ మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తున్న తరుణంలో మనుషులంతా ఒకటేనని భూమండలంపై ఎక్కడ విపత్తు సంభవించినా అది దేశాలు, ప్రాంతాలు, మతాలు, భాషలకు అతీతంగా అందరినీ ప్రభావితం చేయగలదని నిరూపించింది. ఈ నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ మార్చిలోనే ఆయుధాలను వదిలి కొవిడ్ మహమ్మారిపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని శక్తియుక్తులన్నిటినీ దానిపై కేంద్రీకరించాలని అన్ని యుద్ధ మోహరింపు సైన్యాలకు పిలుపునిచ్చారు. ఆ సందేశం కేవలం యుద్ధంలో ఉన్న వారికే గాక సమస్త మానవాళికి వర్తిస్తుంది.


ఈ అసాధారణ పరిస్థితుల్లో ఈ గండం గట్టెక్కడానికి భూమాతను శాంతింప చేయడానికి ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడానికి గళం విప్పాల్సిన అవసరం ఉందని, మనం ఒకరినొకరు సమీపంలో నిలబడలేకపోయినా కలిసి కలలు కనడం ముమ్మాటికీ సాధ్యమేనని, ఐ.రా.స. నొక్కి వక్కాణించింది. ఈ సందర్భంగా దయ, కరుణ, దృఢవిశ్వాసాలను వ్యాప్తి చెందించడంతో బాటు కరోనా బారిన పడ్డ వారి పట్ల ద్వేషాన్ని వీడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.



20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నగరాలు నాశనమయ్యాయి. అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి శాంతి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. ఐ.రా.స 1981లో బ్రిటన్, కోస్టారికా దేశాల చొరవతో శాంతి దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ప్రారంభంలో రోజుల్లో సెప్టెంబరు నెలలోని మూడో మంగళవారం జరిపేవారు. 2001లో సెప్టెంబర్ 21 తేదీ జరపాలని నిర్ణయించారు. ఆ మేరకు 2002 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆరోజునే జరుపుతున్నారు.


1945లో హిరోషిమా- నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి జరిపిన నాటి నుంచి రెండువేలకు పైగా అణ్వాయుధ పరీక్షలు జరిపారు. 75 సంవత్సరాల అనంతరం నేటికీ అమెరికా వద్ద 6185, రష్యా వద్ద 6490 అణ్వాయుధాలు ఉన్నాయని ఆయుధ నియంత్రణ సంస్థ అంచనా వేసింది. 2020లో కేవలం అణ్వాయుధాలపై అమెరికా 5000 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 2019లో అమెరికా సైనిక వ్యయం 73,200 కోట్ల డాలర్లు. చైనా 26,100 కోట్ల డాలర్ల ఖర్చుతో రెండవ స్థానంలో ఉంది. 7,110 కోట్ల డాలర్ల ఖర్చుతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. 


ఈ కాలంలోనే ఆయుధాల అమ్మకం కూడా అగ్రరాజ్యాల ప్రయోజనాల్లో ప్రధాన భాగమయింది. మనకు కనబడుతుంది. అందునా ముఖ్యంగా అమెరికా తమ ఆయుధాలను అమ్ముకునేందుకు ఆసియాలోని వివిధ దేశాల మధ్య వివాదాలను యుద్ధాలుగా మార్చిన ఘనత దక్కించుకుంది. అరబ్, ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఆ ప్రాంతం నిరంతరం రావణాసురుడి కాష్టంలా కాలుతూనే వుంది. భారత ఉపఖండంలో భారత,- పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధాల్లో అమెరికా నిర్వహించిన పాత్ర అదేవిధంగా, పాకిస్థాన్ టెర్రరిస్ట్ క్యాంపుల నిర్వహణకు ఆయుధాలను అందించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ప్రాంతీయ యుద్ధాలే కాక అనేక ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఏళ్లతరబడి కొనసాగుతున్నాయి.


యుద్ధాల వల్ల ప్రజలు నష్టపోవడమే కాక ప్రకృతికి ఎంతో విఘాతం కలుగుతుంది. అణ్వాయుధాల ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలను పారవేయడం ద్వారా కలిగే అణుధార్మికత, జీవ రసాయన ఆయుధాల ప్రయోగాల సమయంలో కలిగే వాతావరణ కాలుష్యాల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై నిత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి ఆవశ్యకత ఎంతైనా ఉంది.


నేటికీ ప్రపంచంలో కోట్లాది ప్రజలు కనీస అవసరాలైన స్వచ్ఛమైన గాలి, మంచినీరు, వైద్యం, గృహవసతి, రవాణా సదుపాయం, ఉపాధి మొదలైనవి అందక ఎంతో దుర్భర జీవితాలను గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలిటరీపై పెట్టే రెండు లక్షల కోట్ల డాలర్ల ఖర్చు పైన పేర్కొన్న కనీస అవసరాలన్నింటిని ఎంతో సులువుగా తక్షణమే తీర్చవచ్చు. కానీ ఆ దేశాధినేతలకు ఆ రాజకీయ సంకల్పం లేదనే విషయం సర్వజన విదితమే. నేటి కొవిడ్ సంక్షోభ కాలంలో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నా ఒక్క వైరస్ నుంచి ఆయా దేశాల ప్రజల మానప్రాణాలను కాపాడలేవు అనే నిజం అందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో ఐ.రా.స 75వ వార్షికోత్సవ సందర్భంలో సభ్యదేశాలు తమ రక్షణ వ్యవస్థలపై క్రమేణా ఖర్చుని తగ్గించే ప్రతిపాదనను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.


శాంతి అంటే యుద్ధం లేకపోవడమే కాదు హింస ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని ఐ.రా.స ఎన్నోసార్లు పేర్కొంది. మన సమాజంలో మహిళలు, బాలలు, మైనారిటీలు, బలహీనవర్గాలు, వలసకూలీలు, వికలాంగులపై నిరంతరం జరిగే హింసను కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటి కంటే ప్రధానమైనది సకల జీవరాసులకు మూలాధారమైన ప్రకృతిపై హింసను ప్రతిఘటించాల్సిన గురుతర బాధ్యత మానవులు అందరిపై ఉంది.


ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలందరినీ జాగృతం చేయాలి. ప్రధానంగా భావి భారతపౌరులైన పాఠశాల విద్యార్థులకు శాంతిని పాఠ్యంశంగా చేర్చి వారిలో చైతన్యం కలిగించాలి. అలాగే కాలేజీ విద్యార్థులతో శాంతి అనే అంశంపై వక్తృత్వ పోటీలు, కళా ప్రదర్శనలతో బాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. మహిళలు సమాన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో భాగంగా శాంతి సాధన కూడా ఒక ఉద్యమంగా కొనసాగాలి. స్వచ్ఛంద సంస్థలు తమ తమ ప్రాంతాల్లో శాంతిని గురించిన చైతన్యాన్ని కలిగించాలి. మానవ హక్కుల్లో శాంతి కూడా ఒక భాగమని మనందరం గుర్తించాలి. ఈ శాంతి ఉద్యమం ప్రపంచవ్యాప్త ప్రజాఉద్యమంగా రూపొందితేనే వివిధ దేశాధినేతలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి వెనకడుగు వేస్తారు. రాబోయే రోజుల్లో అణ్వాయుధాలు, ఇతర రకాల రక్షణ వ్యవస్థలపై చేయబోయే ఖర్చు కొంతమేరకైనా సామాజిక ప్రయోజనాలకు మళ్ళించడానికి వీలవుతుందని మనమంతా గుర్తించాలి. 


డా.పి.నారాయణ రావు

సామాజిక విశ్లేషకులు

(సెప్టెంబరు 21 ప్రపంచ శాంతి దినోత్సవం)


Updated Date - 2020-09-19T06:20:31+05:30 IST