వెన్యూ కన్వెన్షన్‌లో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-05T06:33:58+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ప్రాణాంతక వైరస్‌ బారినపడిన నిరుపేద బాధితులకు సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌, తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన వైద్యసేవలందించేందుకు 100 పడకలతో మరో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ సిద్ధమవుతోంది.

వెన్యూ కన్వెన్షన్‌లో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

సుజనా ఫౌండేషన్‌ సౌజన్యంతో మౌలిక వసతులు 

 ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌ 

విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ప్రాణాంతక వైరస్‌ బారినపడిన నిరుపేద బాధితులకు సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌, తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన వైద్యసేవలందించేందుకు 100 పడకలతో మరో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ సిద్ధమవుతోంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) సమీపంలో ఉన్న సుజనా ఫౌండేషన్‌కు చెందిన ‘వెన్యూ కన్వెన్షన్‌’లో బెడ్లు, ఆక్సిజన్‌ సరఫరా కోసం పైపులు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొవిడ్‌ కేర్‌ సెంటరులో ఆక్సిజన్‌ పైప్‌లైన్లను వీఎండీ ఏపీఎ్‌సఎంఐసీఎల్‌ డిపార్ట్‌మెంట్‌, వాటర్‌ సప్లయ్‌, మొబైల్‌ టాయిలెట్స్‌, బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ బాధ్యతలను వీఎంసీ, బెడ్స్‌ ఏర్పాటు పనులను డీఆర్‌డీఏ పీడీ పర్యవేక్షిస్తుండగా.. ఎలక్ట్రిసిటీ, ఫుడ్‌, డ్రింకింగ్‌ వాటర్‌ (వేడినీళ్లు), వాకీటాకీలు, 6 గోద్రెజ్‌ అల్మరాలు, 10 టేబుళ్లు, 30 కుర్చీలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, గ్లౌజులు, మందులు, సింగ్స్‌, సీసీ కెమెరాలను సుజనా ఫౌండేషన్‌ సమకూరుస్తోంది. కలెక్టరు ఇంతియాజ్‌ మంగళవారం వెన్యూ కన్వెన్షన్‌ హాలును సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌కు అనుసంధానంగా ఈ కొవిడ్‌ కేర్‌ సెంటరును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాతో కూడిన బెడ్లను అత్యవసర చికిత్స అందించాల్సినవారి కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్‌ ట్యాంక్‌, డాక్టర్స్‌, స్టాఫ్‌నర్సులు, సిబ్బందిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సమకూరుస్తారని వివరించారు.  ఈ కొవిడ్‌ కేర్‌ సెంటరుకు అవసరమైన వైద్యులను ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్‌ అసోసియేషన్‌ వారితో సంప్రదించి 20 నుంచి 30 మంది డాక్టర్లు షిప్టుల వారీగా 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెన్యూ కన్వెన్షన్‌ సెంటరులో అగ్నిప్రమాదాన్ని నివారించే వ్యవస్థను అనుసరించేందుకు జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌తో తనిఖీలు చేయిస్తామని చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం వీఎంసీ ఆధ్వర్యంలో పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టరుతోపాటు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేష్‌ తదితర అధికారులు ఉన్నారు.   

మొడికల్‌ సిబ్బంది నుంచి దరఖాస్తులు  

  జిల్లాలోని 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక పద్ధతిపై స్పెషలిస్ట్‌ డాక్టర్లు, మొడికల్‌ ఆఫీసర్లు, నర్సులను నియమించడానికి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఆశక్తి గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్‌  ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, కూచిపూడి, ఉయ్యూరు, విజయవాడ, నందిగామ, మైలవరంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఆసుపత్రుల్లో తాత్కాలిక పద్ధతిపై పనిచేయడానికి ఆశక్తి ఉండి, అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఈ నియామకాలు కేవలం 6 నెలల కాల వ్యవధి పాతిపదికపై తీసుకుంటున్నామన్నారు. ఈ  దరఖాస్తులను విజయవాడ పాత గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లోని డీఎంహెచ్‌వో క్యాంపు కార్యాలయంలో  అందించాలన్నారు. 

140 ఆరోగ్య కేంద్రాల్లో  వ్యాక్సినేషన్‌

 జిల్లా పరిధిలో రెండవ విడత కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ను 140 వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య కేంద్రాల్లో వేయనున్నామని కలెక్టర్‌  ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకుని, 40 రోజులు అయిన వారు వారికి దగ్గరలోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవలన్నారు. బుధవారం జరిగే వ్యాక్సినేషన్‌ కొవిషీల్డ్‌ మొదటి డోస్‌ వేసుకున్న 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే రెండో డోస్‌ వేస్తారాన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ముఖ్యమంత్రి పట్టణ, ఆరోగ్య కేంద్రాల్లోనూ కొవిషీల్డ్‌ వేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండ డోస్‌ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవటం కోసం వేచి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి పర్యవేక్షణలో ఇప్పటికే ఆయా ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్స్‌ను చేరవేశామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-05T06:33:58+05:30 IST