ఇక రెడ్‌, గ్రీన్‌, బ్లూ టోకెన్లు!

ABN , First Publish Date - 2021-05-08T06:56:48+05:30 IST

జిల్లాలో వ్యాక్సినేషన్‌ను పకడ్బంధీ కార్యాచరణతో అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఇక రెడ్‌, గ్రీన్‌, బ్లూ టోకెన్లు!

 వ్యాక్సినేషన్‌కు ప్రణాళిక 

 మున్సిపల్‌, మండల ప్రధాన కేంద్రాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు 

 కలెక్టర్‌ ఇంతియాజ్‌

 విజయవాడ సిటీ, మే 7 : జిల్లాలో వ్యాక్సినేషన్‌ను పకడ్బంధీ కార్యాచరణతో అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రద్దీని నివారించేందుకు ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రంలో రెడ్‌, గ్రీన్‌, బ్లూ టోకెన్ల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి తక్షణం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిఽధిలో నాలుగు నుంచి ఐదు శాశ్వత వాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు. మండల ప్రధాన కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద ఆయా కేంద్రాల్లో అందించే వ్యాక్సిన్‌ (కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌) వివరాలను కూడా ప్రముఖంగా ప్రదర్శించాలన్నారు. ఆయా మన్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు గుర్తించిన శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాల వివరాలను జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారికి, కలెక్టర్‌కు నివేదిక అందించాలన్నారు. భౌతికదూరం పాటిస్తూ మాస్కును తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వ్యాక్సిన్‌ కేంద్రాన్నీ క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేయాలన్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాల్లో రద్దీని నివారించేందుకు ఆయా కేంద్రాల్లో నిరిష్టమైన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 3 టోకెన్ల విధానం

మూడు కేటగిరీలుగా గుర్తించి వ్యాక్సినేషన్‌ను అందించాల్సి ఉందని ఇంతియాజ్‌ పేర్కొన్నారు.  హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు రెడ్‌ టోకెన్‌,  60 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటీజన్స్‌కు గ్రీన్‌ టోకెన్‌,  45 ఏళ్లు నిండిన వారికి బ్లూ టోకెన్‌ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద ఉన్న వ్యాక్సినేషన్‌ డిమాండ్‌కు అనుగుణంగా టోకెన్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా టోకెన్లను వార్డు/ గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ వార్డు, గ్రామ సచివాలయ పరిఽధిలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌షన్‌కు అనుగుణంగా టోకెన్ల జారీ చేపట్టాలని, ఇందుకోసం రిజిస్టర్‌ కూడా నిర్వహించాల్సి ఉందని  పేర్కొన్నారు. ఆయా టోకెన్లపై సచివాలయాలకు సంబంధించి స్టాంపు వేయాల్సి ఉంటుందన్నారు. టోకెన్లను ఒకరోజు ముందు మాత్రమే అందజేయాలన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు సంబంఽధించి సంబంధిత శాఖాధికారులు టోకెన్లు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. టోకెన్ల జారీలో సంబంధిత సచివాలయాల పరిధిలోని వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు పూర్తి బాధ్యతలను చేపట్టాలని, దీనిలో తప్పిదాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో విధులు

ప్రతి కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఇద్దరు పోలీసులు, ఒక సచివాలయ మహిళా భద్రతా అధికారి విధుల్లో ఉండాలన్నారు. రెండు వేచి ఉండే గదులను ఏర్పాటు చేసి ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. వారు క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలన్నారు. వాక్సినేషన్‌ కేంద్రం ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేసి ప్రతి 50 మందికోసం ఒక వలంటీర్‌ను నియమించుకోవాలన్నారు. 500 మందిలోపు గల రిజిస్ట్రేషన్‌ కేంద్రం వద్ద ఒక ఈడీసీఎస్‌ (ఎలక్ర్టానిక్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌) అధికారి, ముగ్గురు వలంటీర్లు 500లకు పైబడిన కేంద్రాల్లో ఇద్దరు ఈడీపీఎస్‌లు, నలుగురు వలంటీర్ల సేవలతో రిజిస్ట్రేషన్‌ చేపట్టాలన్నారు. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొత్తం బాధ్యత ఈడీపీఎస్‌లదేనన్నారు. వ్యాక్సినేషన్‌ అయిన అనంతరం రెండవ డోసు వివరాలు, ఏ వ్యాక్సిన్‌ వేశారో వివరాలతో కూడిన పింక్‌ స్లిప్‌లను జారీ చేసేందుకు ఆరుగురు వలంటీర్లను నియమించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ను సక్రమంగా చేపట్టేందుకు ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ఆశా వర్కర్లకు విధులు కేటాయించాలన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఏఎన్‌యంలు వ్యాక్సిన్‌ వేస్తారని, ఒక ఆశా వర్కర్‌ వ్యాక్సిన్‌ను ఇంజక్షన్‌లోకి లోడు చేయడం, మరో ఏఎన్‌ఎం వేసిన ఇంజక్షన్‌ సిరంజిని డిస్పోజ్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2021-05-08T06:56:48+05:30 IST