జిల్లాకు మూడు ఆక్వా ల్యాబ్‌లు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-18T05:52:33+05:30 IST

జిల్లాకు ఎంపెడా మూడు ఆక్వా ల్యాబ్‌లను మంజూరు చేయడం ముదావహమని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

జిల్లాకు మూడు ఆక్వా ల్యాబ్‌లు : కలెక్టర్‌

మచిలీపట్నం టౌన్‌ , మే 17 :  జిల్లాకు ఎంపెడా మూడు ఆక్వా ల్యాబ్‌లను మంజూరు చేయడం ముదావహమని కలెక్టర్‌ ఇంతియాజ్‌  తెలిపారు. ఎంపెడా ఆధ్వర్యాన మచిలీపట్నం శారదానగర్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్‌ను కలెక్టర్‌ సోమవారం  ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నాక్సా, ఎంపెడా సంయుక్తంగా ఆక్వా రైతులకు ఎంతో ఉపయోగపడేలా అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకో వాలన్నారు. సుస్థిరమైన దిగుబడులకు ఆధునిక సాకేంతిక పద్ధతులు ఎంతో అవసరమన్నారు. ఆక్వా కల్చర్‌ మన రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయపు వనరు అన్నారు. నాక్సా కార్యనిర్వహణాధికారి షణ్ముకరావు మాట్లాడుతూ, ఆక్వా సాగులో ఆక్వా ఒన్‌ సెంటర్‌ ల్యాబ్‌ ఎంతో కీలకమైందన్నారు. రొయ్య లు, చేపల సాగులో నష్టాలు రాకుండా చెరువులో నీటి నాణ్యత, విత్తనం, వ్యాధి నిర్ధారణ, పరీక్షలు తదితర సేవలు ఆక్వా రైతులకు ఈ ల్యాబ్‌ ద్వారా అందిస్తామన్నారు. సొసైటీ రైతులకు లాభాపేక్ష లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, మత్స్య శాఖ జేడీ  లాల్‌ మహ్మద్‌, నాక్సా జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడు సైకం భాస్కరరావు, మత్స్య శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డి, ఎఫ్‌డీవో ప్రతిభ, తహసీల్దార్‌ సునీల్‌ బాబు  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:52:33+05:30 IST