85 వేల ఎకరాల పంటని కాపాడాం

ABN , First Publish Date - 2020-12-04T05:47:50+05:30 IST

నివర్‌ తుపాను వల్ల జిల్లాలో నీట మునిగిన 2.66 లక్షల ఎకరాల వరిలో 85 వేల ఎకరాలను కాపాడగలిగామని కలెక్టరు ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

85 వేల ఎకరాల పంటని కాపాడాం
కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కలెక్టరు, జాయింట్‌ కలెక్టర్‌

మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు 

రైతులెవ్వరూ అధైర్యపడొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుపాను వల్ల జిల్లాలో నీట మునిగిన 2.66 లక్షల ఎకరాల వరిలో 85 వేల ఎకరాలను కాపాడగలిగామని కలెక్టరు ఆనంద్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను వెలిసిన మరుసటి రోజు నుంచే పొలాల్లో నిలిచిన వర్షం నీటిని డ్రెయినేజీలలోకి మళ్లించడం వల్ల ఆయా రైతులకు మేలు చేయగలిగామన్నారు. నష్టపోయిన రైతుల ప్రతీ ఎకరం పొలాన్ని తప్పక లెక్కిస్తామన్నారు. డిసెంబరు 31వ తేదీకి వారికి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ దృష్ట్యా రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఎవరివైనా పంటలను గ్రామస్థాయి అధికారులు లెక్కించకపోతే వారు తమకు వివరాలు అందజేస్తే ప్రత్యేక బృందాలను పంపిస్తామన్నారు. నష్టపోయిన రైతులు మరో పంట వేసేందుకు 85 శాతం సబ్సిడీపై మినుము, పెసర విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,200 ప్రదేశాల్లో పంట కోత ప్రయోగాలు కూడా చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రైతులకు బీమా సొమ్ము కూడా చేతికందుతుందన్నారు. తడిసిన ధాన్యం దృష్ట్యా ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను కొంతమేరకు సడలించిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు జిల్లా వ్యాప్తంగా  164 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం తీసుకెళ్లి విక్రయించి కనీస మద్దతు ధరని పొందాలని సూచించారు. రైతులు ఎలాంటి సాయం కోసం అయినా కంట్రోల్‌ రూం నెంబరు. 9491392717ని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జయంతి పాల్గొన్నారు. 

రుణాలు వెంటనే మంజూరు చేయాలి


ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత, బీమా పథకాల లబ్ధిదారులకు డిసెంబరు 15 లోపు బ్యాంకులు రుణాలు అందించాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ బ్యాంకర్లను ఆదేశించారు. ప్రధానమంత్రి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పీఎం స్వనిధి కింద మంజూరు చేసిన 20 వేల మందికి, జగనన్న తోడు పథకం కింద 68 వేల మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించాలన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం కింద మహిళలకు జీవాల కొనుగోలు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 లోపుప మండలానికి 25 చొప్పున వెయ్యి మందికి రుణాలు అందించాలన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇప్పటికే 96 శాతం రుణాలు అందించడం గొప్ప పరిణామమని తెలిపారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, డీజీఎం శ్రీనివాస్‌, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్‌ కామేశ్వరరావు, ఇండియన్‌ బ్యాంకు డీజీఎం ప్రసాద్‌, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ నాగవేణి, ఎల్‌డీఎం రామ్‌ ఈదర, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌ నాయక్‌, మెప్మా పీడీ బాలయ్య, నగరపాలకసంస్థ కమిషన్‌ చల్లా అనురాధ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:47:50+05:30 IST