సీఎం సూచనతోనే కలెక్టర్‌ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-28T04:37:44+05:30 IST

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రోద్బలంతోనే కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అనుచిత వ్యాఖ్యాలు చేశారని టీపీసీసీ కిసాన్‌ సెల్‌ కన్వీనర్‌ నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు.

సీఎం సూచనతోనే కలెక్టర్‌ వ్యాఖ్యలు
సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కన్వీనర్‌ నాయిని నర్సింహారెడ్డి

 రైతులను నట్టేట ముంచే ప్రయత్నం 

 కలెక్టర్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి

 టీపీసీసీ కిసాన్‌ సెల్‌ కన్వీనర్‌ నాయిని నర్సింహారెడ్డి


సిద్దిపేట అగ్రికల్చర్‌, అక్టోబరు 27: సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రోద్బలంతోనే కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అనుచిత వ్యాఖ్యాలు చేశారని టీపీసీసీ కిసాన్‌ సెల్‌ కన్వీనర్‌ నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని నర్సింహారెడ్డి,  సిద్దిపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గూడూరి శ్రీనివాస్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణరెడ్డితో కలిసి మాట్లాడారు. రూ.వేల కోట్ల ప్రజాధనంతో ప్రాజెక్టులు కట్టిన ప్రభుత్వం రైతులను వరి పండించొద్దని హెచ్చరించడం వారిని నట్టేట ముంచే ప్రయత్నమేనని విమర్శించారు. ఫర్టిలైజర్‌ దుకాణదారుల సమావేశంలో కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. రైతులపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని  తెలిపారు. సమావేశంలో నాయకులు యాదగిరి, శ్రవణ్‌ కుమార్‌, కిరణ్‌కుమార్‌, వహాబ్‌, అజ్మత్‌ పాల్గొన్నారు.


వ్యవసాయంపై అవగాహన లేకనే..


హుస్నాబాద్‌, అక్టోబరు 27: కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేకనే అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతు ఐక్యతా సంఘం హుస్నాబాద్‌ మండల కన్వీనర్‌ పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌ ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. చెరువులు, కుంటలు, డ్యాంల కింద ఉన్న భూముల్లో ఇంకా మూడు నెలల వరకు నీటి తడి ఆరే పరిస్థితి లేదని, ఈ భూముల్లో ఏ పంటలు వేయాలో కలెక్టర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


రైతులకు క్షమాపణ చెప్పాలి


చిన్నకోడూరు, అక్టోబరు 27: రైతుల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా కలెక్టర్‌ మాట్లాడం సరికాదని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు  చేపడుతామని హెచ్చరించారు. ఆయనవెంట కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు కరుణాకర్‌ ఉన్నారు.




రైతులను కించపరిచేలా మాట్లాడడం సరికాదు


దుబ్బాక, అక్టోబరు 27: రైతులను కించపరిచేవిధంగా కలెక్టర్‌ మాట్లాడడం సరికాదని బీజేపీ నాయకులు ఎంగారి రాజిరెడ్డి, మచ్చ శ్రీనివాస్‌, షాదుల్‌, స్వామి, యాదగిరి, అంజనేయులు, సాయిలు, పోఽశయ్య, మైసయ్య అన్నారు. 


కలెక్టర్‌ దిష్టిబొమ్మ దహనం 


బెజ్జంకి, అక్టోబరు 27: కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌  జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, కిసాన్‌ సెల్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కొమురయ్య, రాజేశంగౌడ్‌, రవి, మల్లేశం, శరత్‌, నరేందర్‌రెడ్డి, ఐలయ్య, భూంరెడ్డి, పరశురాములు, బాలయ్య పాల్గొన్నారు.


వరికి బదులు ఇంకేం పంట వేయాలి?


జగదేవ్‌పూర్‌, అక్టోబరు 27: యాసంగిలో వరి వేయకుంటే ఇంకేం పంట వేస్తారని వైఎస్సార్‌టీపీ ఉమ్మడి మెదక్‌ జిల్లా కో కన్వీనర్‌ మేదిని రామలింగారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మర్కుక్‌లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మాణం చేపట్టింది ఎందుకన్నారు. వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ అనడం సిగ్గు చేటన్నారు. ఆయనవెంట రాష్ట్ర యూత్‌ విభాగం నాయకుడు సిలివేరు ఇంద్రగౌడ్‌, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకులు గద్దల సురేష్‌, జగదేవపూర్‌ మండల కన్వీనర్‌ రాగుల నాగరాజు, వర్గల్‌ మండల కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అజారుద్దీన్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-10-28T04:37:44+05:30 IST