గుంతకల్లు రైలుమార్గం భూసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-03-09T06:02:11+05:30 IST

గుంటూరు - గుంతకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు అవసరమైన భూసేకరణ పనులు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

గుంతకల్లు రైలుమార్గం భూసేకరణ పూర్తి చేయాలి
రైల్వే భూసేకరణపై సమీక్షిస్తున్న కలెక్టర్‌

గుంటూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గుంటూరు - గుంతకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు అవసరమైన భూసేకరణ పనులు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణ పురోగతిపై రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్జా శ్రీకాంత్‌తో కలిసి కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో  పాటు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సేకరించిన భూమిని రైల్వే అథారిటీకి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జా శ్రీకాంత్‌ మాట్లాడుతూ భూసేకరణ చెల్లింపులకు అవసరమైన నిధులు ఉన్నందున పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు వినుకొండ, నూజెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, శావల్యాపురం, ఫిరంగిపురం మండలాల్లో దాదాపు 60 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందన్నారు. సమావేశంలో జేసీ దినేష్‌కుమార్‌, దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ కే రామారావు, నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపుర్‌, గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, కలెక్టరేట్‌ భూవిభాగం సూపరింటెండెంట్‌ అయ్యంగార్‌ పాల్గొన్నారు. 

పోలింగ్‌ శాతం పెరిగేలా చూడండి

మునిసిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఓటర్‌ స్లిప్పులను 100 శాతం పంపిణీ చేస్తే కచ్ఛితంగా పోలింగ్‌ శాతం పెరుగుతుందన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల కోసం వీల్‌చైర్లు, ప్రత్యేకమైన క్యూలైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ సందర్భంగా ఏమైనా ఘర్షణలు జరిగితే ఆ వివరాలను సంబంధిత సెక్టోరల్‌ అధికారి, రూట్‌ ఆఫీసర్‌కి తెలియజేయాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జీఎం ఎలక్షన్‌ 2021 ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి జేసీ  దినేష్‌కుమార్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, జేసీ పీ ప్రశాంతి,   కే శ్రీధర్‌రెడ్డి, గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-09T06:02:11+05:30 IST