గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-21T06:32:28+05:30 IST

ఈనెల 26 గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు.

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌. పక్కన సీపీ శ్రీనివాసులు, కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ మాధవీలత తదితరులు

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

అధికారులకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచనలు

విజయవాడ సిటీ : ఈనెల 26 గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం 8.51 గంటలకు డీజీపీ, 8.55కు సీఎస్‌, 8.56కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 8.57కు సీఎం, 8.58కు గవర్నర్‌ స్టేడియానికి చేరుకుంటారన్నారు. 9 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెప్పారు. 9.01 నుంచి 9.10 గంటల వరకు పోలీస్‌ పరేడ్‌ను గవర్నర్‌ సమీక్షిస్తారన్నారు. అనంతరం కవాతు దళాలతో మార్చ్‌ఫాస్ట్‌ జరుగుతుందని, 9.41కు గవర్నర్‌ సందేశం ఇస్తారన్నారు. 9.57 గంటలకు మార్చ్‌ఫాస్ట్‌లో ఉత్తమంగా నిలిచిన కంటెంజెంట్స్‌కు ట్రోఫీలు, బహుమతులు అందజేస్తారన్నారు. అనంతరం ప్రభుత్వ శాఖల శకటాల్లో ఉత్తమంగా నిలిచిన వాటికి బహుమతులు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు,  ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఆర్మీ, ఎన్‌సీసీ కంటెజెంట్స్‌, అధికారులు పాల్గొంటారని కలెక్టర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధ నలను అనుగుణంగా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే వారి ప్రవేశం, పార్కింగ్‌ కోసం ఏర్పాట్లను చేశామన్నారు. గవర్నర్‌, సీఎం స్టేడియానికి చేరుకునే ముందే మంత్రులు,  ప్రజాప్రతినిధులు వచ్చేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. జేసీలు కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

బందరులో భారీగా..

గణతంత్ర దినోత్సవాన్ని మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. మచిలీపట్నంలో నిర్వహించే ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ బుధవారం సమీక్షించారు. దేశభక్తి, మన సంస్కృతిని ఇనుమడింపజేసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తారని తెలిపారు. జేసీ కె.మోహన్‌కుమార్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, బందరు ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.

విత్తన కంపెనీ యాజమాన్యమే  రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

జూలైలో కాకర, బీర సాగుచేసి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత విత్తన సరఫరా కంపెనీ వారిని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి పరిహార కమిటీ (డీఎల్‌సీసీ) సమావేశంలో కలెక్టర్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు.

మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన 

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్‌ అభయాన్‌ కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో బుధవారం పలు కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. 

రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది

జిల్లాలో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. నివర్‌ తుఫాను కారణంగా జిల్లాలో 93,872 హెక్టార్లలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం దెబ్బతిందన్నారు. 10 శాతం కంటే ఎక్కువ ధాన్యం రంగుమారి పాడైందన్నారు. రైతులు తమ దగ్గరలోని  రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చని చెప్పారు.  ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 425 4402లో గానీ, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం నెంబరు 77020 03571లో గానీ సంప్రదించాలని సూచించారు. 2020-21 ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో 10లక్షల10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు.

Updated Date - 2021-01-21T06:32:28+05:30 IST