కలిసి పనిచేస్తే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-07-09T10:34:27+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు నెలరోజులుగా పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య, మెడికల్‌ కళాశాల, రెవెన్యూశాఖ కలిసి..

కలిసి పనిచేస్తే కరోనా కట్టడి

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి 

అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌


నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 8: జిల్లాలో కొవిడ్‌ కేసులు నెలరోజులుగా పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య, మెడికల్‌ కళాశాల, రెవెన్యూశాఖ కలిసి ప్రణాళిక ప్రకారం పనిచేస్తే కట్టడి చేయవచ్చని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. వైద్య, రెవెన్యూ, మెడికల్‌ కళాశాల అధికారులతో బుధవారం నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రోజుకు 30 టెస్టులు మాత్రమే చేయగలిగే పరిస్థితి ఉన్నందున అధికారులు ప్రణాళికా ప్రకారం పనిచేయాలన్నారు. మొదట కొవిడ్‌ లక్షణాలున్నవారికి, తరువాత ప్రైమరీ కాంటాక్ట్స్‌లో లక్షణాలున్నవారికి, పరిసర ప్రాంతాల్లో లక్షణాలున్నవారికి టెస్టులు చేయాలన్నారు.


జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ల్యాబ్‌లో సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు షిప్టుల్లో టెస్టులు చేయాలని, పాజిటివ్‌ ఉన్న వ్యక్తులకు సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌ చికిత్స, సూచనలు చేయాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి సరైన వైద్యం అందిస్తే ఉధృతి కొంత తగ్గుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 250 బెడ్లను వెంటనే సిద్ధం చేయాలని, మరో పదిరోజుల్లో మొత్తం 400 బెడ్లను ఏర్పాటుచేయాలన్నారు.  ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సరిగా గుర్తించి, వారు కచ్చితంగా 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణను కట్టడి చేయగలమన్నారు. 

Updated Date - 2020-07-09T10:34:27+05:30 IST