భూ కబ్జాపై నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2021-04-16T06:49:21+05:30 IST

మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ లేఔట్‌లోని మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల కబ్జా విషయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు.

భూ కబ్జాపై నివేదిక ఇవ్వండి
మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు వద్ద స్థానికులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ ఎం.మాధురి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

రంగంలోకి రెవెన్యూ యంత్రాంగం

36 ఎకరాల్లో సర్వేకు నిర్ణయం

కలెక్టర్‌కు వారంలో సమగ్ర నివేదిక

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన 


భవానీపురం, ఏప్రిల్‌ 15 : మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ లేఔట్‌లోని మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల కబ్జా విషయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. మంత్రి అనుచరులు ఈ లేఔట్‌లో రోడ్లను కబ్జా చేసి, స్థలాల కింద విక్రయిస్తున్న అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్‌ 36 ఎకరాల లేఔట్‌ను సమగ్రంగా సర్వే చేసి, పూర్తిస్థాయి నివేదికను వారంలోగా అందజేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ తహసీల్దార్‌ ఎం.మాధురి మహ్మదీయ సొసైటీ భూముల కబ్జాపై ఆరా తీశారు. ఈ సొసైటీ భూములను సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌ బేగ్‌ను ఆదేశించారు. గురువారం సర్వేయర్‌ బేగ్‌, వీఆర్వో సిరివెన్నెల తదితరులు సొసైటీ లేఔట్‌లోని 40 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు ముస్తాక్‌, అమ్మపాద అపార్టుమెంట్‌ ప్లాట్లదారులతో తహసిల్దార్‌ మాట్లాడారు. 49 సెంట్ల స్థలంను అమ్మపాద అపార్టుమెంట్లో కలిపేసుకున్నారని, వారికి నడక మార్గం ఇది కాదని దర్గా కమిటీ నాయకులు వాదనకు దిగడంతో ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని ఆమె సూచించారు. లేఔట్‌ ప్రకారం కబ్జాదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నించింది రోడ్డా లేక కామన్‌సైటా అన్నది తేల్చి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై మాధురి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేయించి, వారంలోగా నివేదికను సమర్పిస్తానని చెప్పారు.

Updated Date - 2021-04-16T06:49:21+05:30 IST