ధైర్యంగా ఓటు వేయండి!

ABN , First Publish Date - 2021-04-16T05:09:56+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లంతా ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌, తిరుపతి పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు కోరారు.

ధైర్యంగా ఓటు వేయండి!
విలేకరులతో మాట్లాడుతున్న తిరుపతి ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చక్రధర్‌బాబు, పక్కన ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌

తిరుపతి ఉప ఎన్నికకు ఏర్పాట్లు

పార్లమెంటు పరిధిలో అమల్లోకి 144 సెక్షన్‌

28 కంపెనీల కేంద్ర బృందాలు, పోలీసులతో బందోబస్తు

1,245 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

ఎన్నికల విధుల నుంచి వలంటీర్లు దూరం

నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో కౌంటింగ్‌

రిటర్నింగ్‌ అధికారి చక్రధర్‌బాబు వెల్లడి


నెల్లూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లంతా ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌, తిరుపతి పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌తో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిందని, తిరుపతి పార్లమెంటు పరిధిలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి ఏడు గంటల వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. 2,470 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, 10,850 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. వీందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. 1245 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరింపజేస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల వద్ద సెక్టార్‌ అధికారులను నియమించామని, వీరందరూ జోనల్‌ మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారని ప్రకటించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటికే  28 కంపెనీల కేంద్ర బలగాలు, మూడు బృందాల స్పెషల్‌ పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయన్నారు. 


ఇతరులు వెళ్లిపోవాలి!

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న బయట వ్యక్తులు వెళ్లిపోవాలని రిటర్నింగ్‌ అధికారి సూచించారు. ప్రత్యేక బృందాలతో హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్‌ హాళ్లలో తనిఖీ చేస్తున్నామని చెప్పారు. అలానే సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 280 మందితో కూడిన స్క్వాడ్‌ బృందాలు విస్తృతంగా తిరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్ల నగదు, మద్యం, నిషేధిత వస్తువులతోపాటు 18 వాహనాలను కూడా సీజ్‌ చేశామని కలెక్టర్‌ వెల్లడించారు. సీవిజిల్‌ యాప్‌, కాల్‌ సెంటర్ల ద్వారా 41 ఫిర్యాదులు అందాయని, సకాలంలో అన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలానే 145 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామన్నారు. అభ్యర్థుల ఖర్చులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 80 ఏళ్లు పైబడిన 508 మంది వృద్ధులు, 284 మంది దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని, అలానే 497 మంది సర్వీసు ఓటర్లు ఎలకా్ట్రనిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటును పంపారని  వివరించారు. ఇప్పటికే ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశామని, అయితే ఇది గుర్తింపు కార్డు కాదని, కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డు ఓటు వేసేందుకు తీసుకురావాలని సూచించారు. అలానే ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకొని వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని పేర్కొన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు ఆయా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు అయి ఉండాలని చెప్పారు. కాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కౌంటింగ్‌ మే 2వ తేదీన నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూంలను ఇక్కడే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.   

Updated Date - 2021-04-16T05:09:56+05:30 IST