ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: కలెక్టర్‌ శశాంక్‌

ABN , First Publish Date - 2020-02-28T11:34:48+05:30 IST

ఇంటింటా ఇంకుడు తప్పని సరిగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ శశాంక్‌ అన్నారు. గురువారం పట్టణంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. 15,21,22,23,24,25,27 వార్డుల్లో పర్యటించారు.

ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: కలెక్టర్‌ శశాంక్‌

జమ్మికుంట, ఫిబ్రవరి 27: ఇంటింటా ఇంకుడు తప్పని సరిగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ శశాంక్‌ అన్నారు. గురువారం పట్టణంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. 15,21,22,23,24,25,27 వార్డుల్లో పర్యటించారు. నేరుగా ఆయా వార్డుల ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమను స్వయంగా కలెక్టర్‌ పలుకరించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. 25,27 వార్డుల్లో మురుగు కాలువల పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాలువల నుంచి వచ్చిన నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేక పెద్ద గుంతలుగా ఏర్పడడం చూసి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. తమ వార్డులో అంగన్‌వాడీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ భవనం కోసం వెచ్చించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని 27వ వార్డు కౌన్సిలర్‌ గాజుల భాస్కర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. అదే విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు పనులు యుద్ధ ప్రాతిపదికన దగ్గరుండి చేపడుతున్న చైర్మన్‌ తక్కళ్పల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ దేశీని స్వప్న-కోటి, కమిషనర్‌ ఎండీ అనిసూర్‌ రషీద్‌, అధికారులు, కౌన్సిలర్లను ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ ఇళ్లలో వాడుకుంటున్న నీరు అంతా మురుగు కాలువల్లోకి రాకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని చెప్పారు. ప్రతి నీటి బొట్టు గుంతలోకి వెళ్లేలా చూడాలని అప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గుడిసెల నుంచి మొదలు పెట్టకుండా భవన యాజమానుల నుంచి ప్రారంభించాలని సూచించారు. క్రమేనా ప్రతి ఒక్కరు నిర్మించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఖాళీ స్థలాల యాజమానులకు నోటీసులు జారీ చేయాలని, ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ప్రహరీ గోడలు నిర్మించుకుంటే పందులకు నిల్వ నీడ ఉండదని అన్నారు. తద్వార వాటిని కొంత వరకు నివారించగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొనగంటి సంపత్‌, ఆర్డీవో బెన్‌షాలోమ్‌, తహసీల్దార్‌ కె నారాయణ, కమిషనర్‌ ఎండీ అనిసూర్‌ రషీద్‌, కౌన్సిలర్లు పాతకాల రమేష్‌, దిడ్డి రాము, బచ్చు మాధవి, పొనగంటి మల్లయ్య, గుల్లి పూలమ్మ, సాయిని రమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:34:48+05:30 IST