నర్సంపేటలో కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-02-28T10:53:24+05:30 IST

పచ్చదనం, పరిశుభ్రతతో వార్డులు, తద్వార నర్సంపేట పట్టణం మెరిసిపోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. పట్టణ

నర్సంపేటలో కలెక్టర్‌ పర్యటన

పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి పనుల పరిశీలన

పచ్చదనం, పరిశుభ్రతతో వార్డులు, పట్టణం మెరిసిపోవాలి : కలెక్టర్‌ హరిత


నర్సంపేట, ఫిబ్రవరి27: పచ్చదనం, పరిశుభ్రతతో వార్డులు, తద్వార నర్సంపేట పట్టణం మెరిసిపోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సంపేట పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జేసీ, మండల ప్రత్యేక అధికారి, కమిషనర్‌, వార్డుల ఇన్‌చార్జి అధికారులతో కలిసి పర్యటించారు. పట్టణంలోని 2, 3, 17, 23, 24వ వార్డుల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా 23వ వార్డు దళిత కాలనీలో నిరుపయోగంగా మారిన మంచినీటి బావిని, అధ్వాన్నంగా ఉన్న మురికి కాలువలను పరిశీలించారు. దళిత కాలనీలోని బావిలోకి మురికి నీరు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి మునిసిపల్‌ సమావేశాల్లో చర్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


అలాగే కలెక్టర్‌ పర్యటించిన వార్డుల్లో అధ్వాన్నంగా మారిన రోడ్లు, మురికి గుంతలు, కాలువల చుట్టూ పెరిగిన పిచిమొక్కలు, విద్యుత్‌ స్తంబాల ఏర్పాటు, తాగునీటి సమస్యల వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో సమస్యల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ వార్డుల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, పచ్చదనం వంటి కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పాల్గొని వార్డుల్లో చెత్తా, చెదారం లేకుండా చేసి మురికి కాలువలను శుభ్రం చేయించాలన్నారు. రోడ్ల వెంట పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్ళ పొదలను తొలగించాలని సూచించారు. ప్రతీ వార్డులో 4 కమిటీలను ఏర్పాటు చేశారని, ఒక్కో కమిటీలో 15 మంది వంతున 60 మంది కమిటీలో ఉన్నారని వీరంతా వార్డుల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.


10 రోజుల పట్టణ ప్రగతి కార్య క్రమంతో పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాల సౌకర్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. 23వ వార్డు దళిత కాలనీలో తాగునీటి బావి మరమ్మతుకు, డ్రెయినేజీల నిర్మాణం తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ మహేందర్‌రెడ్డి, ఆర్డీవో హరిసింగ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, ప్రత్యేక అధికారి తోట శ్రీనివాసరావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజనికిషన్‌, అంగన్‌వాడీ టీచర్‌ భారతితో పాటు వార్డుల ఇన్‌చార్జి అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T10:53:24+05:30 IST